Telugu Global
National

శాంతించిన రెజ్లర్లు.. ఐఓఏ కమిటీ విచారణ..

మహిళలపై లైంగిక హింస నిరోధక చట్టం 2013 ప్రకారం కమిటీ ఏర్పాటు చేశామని IOA తెలిపింది. బాధితుల పేర్లను రెజ్లర్లు తెలియజేస్తే.. వాళ్లను కూడా కమిటీ సభ్యులు కలుస్తారని తెలిపింది.

శాంతించిన రెజ్లర్లు.. ఐఓఏ కమిటీ విచారణ..
X

మహిళా రెజ్లర్లపై లైంగిక దాడుల నేపథ్యంలో మూడు రోజులుగా నిరసన తెలియజేస్తున్న రెజ్లర్లు శాంతించారు. శుక్రవారం అర్థరాత్రి దాటాక తమ ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు. మేరీకోమ్ సారథ్యంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(IOA) విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేయడం, నాలుగు వారాల నిర్దిష్ట గడువు ఇవ్వడంతో రెజ్లర్లు ఆందోళన విరమించారు. క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తో రెండో దఫా చర్చల్లో సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ లభించిందని వారు తెలిపారు. కమిటీ విచారణ పూర్తయ్యేవరకు బ్రిజ్‌భూషణ్‌ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటారని క్రీడాశాఖ మంత్రి హామీ ఇచ్చారన్నారు.

మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్‌ లైంగిక హింసకు పాల్పడ్డారని, తమ ఫిర్యాదుపై విచారణకు వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ IOA అధ్యక్షురాలు పీటీ ఉషకు రెజ్లర్లు లేఖ రాశారు. దీంతో శుక్రవారం సాయంత్రం అత్యవసర కార్యనిర్వాహక మండలి సమావేశం ఏర్పాటు చేసి, విచారణకోసం మేరీకోమ్‌ సారథ్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. మహిళలపై లైంగిక హింస నిరోధక చట్టం 2013 ప్రకారం కమిటీ ఏర్పాటు చేశామని IOA తెలిపింది. బాధితుల పేర్లను రెజ్లర్లు తెలియజేస్తే.. వాళ్లను కూడా కమిటీ సభ్యులు కలుస్తారని తెలిపింది. అయితే రెజ్లర్లు డిమాండ్‌ చేసినట్టుగా WFI ను రద్దు చేసే అధికారం తమకు లేదని IOA తెలిపింది.

కమిటీ తికమక..

అయితే IOA ఏర్పాటు చేసిన కమిటీలో ఎక్కువ మంది బీజేపీతో సంబంధం ఉన్న నేతలే ఉన్నారనే విమర్శలు వినిపించాయి. బ్రిజ్ భూషణ్‌ కు మద్దతుగా నిలిచే యోగేశ్వర్‌ ను కమిటీలోకి ఎంపిక చేయడంపై రెజ్లర్లు తీవ్రంగా స్పందించారు. తమకు ఆ కమిటీ వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. దీంతో మరోసారి క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లు సమావేశమయ్యారు. కొత్త కమిటీ ఏర్పాటుతోపాటు, నాలుగు వారాలు డెడ్ లైన్ కూడా విధిస్తున్నామని ఆయన రెజ్లర్లకు హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

First Published:  21 Jan 2023 8:33 AM IST
Next Story