రెజ్లర్ల ఆరోపణలు తీవ్రమైనవి.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసు
బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై కేసు నమోదు చేయడం లేదంటూ స్టార్ రెజ్లర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నప్పటికీ పోలీసులు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై కేసు నమోదు చేయడం లేదంటూ స్టార్ రెజ్లర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ధర్మాసనం ఢిల్లీ పోలీసులకు మంగళవారం నోటీసులు ఇచ్చింది.
వారి ఆరోపణలు తీవ్రమైనవే..
రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలు తీవ్రమైనవేనని.. దీనిపై పోలీసుల స్పందన తెలియజేయాలని ఆ నోటీసులో ధర్మాసనం పేర్కొంది. బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏడుగురు మహిళా రెజ్లర్లు ఈ కేసు దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పిటిషన్ వేశారు.
రికార్డుల నుంచి ఫిర్యాదుదారుల పేర్ల తొలగింపునకు ఆదేశాలు..
లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా.. పోలీసులు కేసు నమోదు చేయలేదని రెజ్లర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై ఏప్రిల్ 28వ తేదీన విచారణ చేపడతామని తెలిపింది. ఈ కేసులో ఫిర్యాదు దారుల వివరాలను గోప్యంగా ఉంచేందుకు జ్యుడీషియల్ రికార్డుల నుంచి ఆ ఏడుగురు రెజ్లర్ల పేర్లను తొలగించాలని ఆదేశించింది.