వెనక్కి తగ్గలేదు.. తగ్గే ఆలోచన కూడా లేదు.. - నిరసన నుంచి తప్పుకున్నట్టు వచ్చిన వార్తలపై సాక్షి మాలిక్ క్లారిటీ
సాక్షి మాలిక్ అవన్నీ తప్పుడు వార్తలేనని కొట్టిపారేశారు. తాము ఉద్యోగాల్లో చేరనంతమాత్రాన ఈ ఆందోళన నుంచి తప్పుకున్నట్టు కాదని స్పష్టం చేశారు. తమకు న్యాయం జరిగేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
తాను నిరసన నుంచి తప్పుకున్నట్టు జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ స్పష్టం చేశారు. దీనిపై సోమవారం ఆమె స్పందించారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనని, తాము న్యాయం కోసం పోరాడుతున్నామని ఆమె తెలిపారు. తమలో ఎవరూ వెనక్కి తగ్గలేదని, వెనక్కి తగ్గే ఆలోచన కూడా తమకు లేదని స్పష్టం చేశారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు.. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఈ నిరసన నుంచి తప్పుకోనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె తిరిగి తన విధుల్లో చేరనున్నట్టు ఆ వార్తల్లో పేర్కొన్నారు.
ఆ వార్తలపై స్పందించిన సాక్షి మాలిక్ అవన్నీ తప్పుడు వార్తలేనని కొట్టిపారేశారు. తాము ఉద్యోగాల్లో చేరనంతమాత్రాన ఈ ఆందోళన నుంచి తప్పుకున్నట్టు కాదని స్పష్టం చేశారు. తమకు న్యాయం జరిగేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ రైల్వేలో విధులు నిర్వర్తిస్తున్నారు.