డేటింగ్ యాప్‌లను నిషేధించాల్సిందే..
డేటింగ్ యాప్‌లను నిషేధించాలంటూ వాసాయ్‌లో ఉద్ధవ్ మహిళా సేన ఆందోళన చేపట్టింది. ఇది తమ అభ్యర్థన అనుకోవద్దని, తమ డిమాండ్ అని డేటింగ్ యాప్ నిర్వాహకులకు కూడా ఇదే తమ హెచ్చరిక అని అన్నారు.
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యోదంతంతో డేటింగ్ యాప్‌లు చర్చనీయాంశంగా మారాయి. శ్రద్ధావాకర్‌ని డేటింగ్ యాప్‌లో ట్రాప్ చేసిన ఆఫ్తాబ్, ఆ తర్వాత అదే యాప్ ద్వారా మరో యువతికి చేరువయ్యాడు. శ్రద్ధా వాకర్ మృత శరీర భాగాలు ఇంటిలో ఉండగానే రెండో యువతితో సరసాలు మొదలుపెట్టాడు. శ్రద్ధా వాకర్ హత్యకు పరోక్షంగా డేటింగ్ యాప్ కూడా ఒక కారణం అంటూ.. అసలు డేటింగ్ యాప్ సంస్కృతిని నిషేధించాలని డిమాండ్ చేశారు శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం మహిళా నేతలు. డేటింగ్ యాప్‌లను నిషేధించాలంటూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ఆఫ్తాబ్, శ్రద్ధా డేటింగ్ యాప్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయిన తర్వాత మహారాష్ట్రలోని వాసాయ్ ప్రాంతంలో కొంతకాలం సహజీవనం చేశారు. ఆ తర్వాత వారిద్దరూ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో సహజీవనం చేసే సమయంలోనే వారు గొడవలు పడ్డారు. శ్రద్ధాను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు ఆఫ్తాబ్. అక్కడితో ఆగకుండా శరీరాన్ని 35 భాగాలుగా ముక్కలు చేసి అడవుల్లో పారేశాడు. ఈ హత్యోదంతం ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డేటింగ్ యాప్‌ల వల్ల ఇలాంటి దారుణాలు కూడా జరుగుతున్నాయనే విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. అందుకే ఈ డేటింగ్ యాప్‌లను నిషేధించాలంటూ వాసాయ్‌లో ఉద్ధవ్ మహిళా సేన ఆందోళన చేపట్టింది. ఇది తమ అభ్యర్థన అనుకోవద్దని, తమ డిమాండ్ అని డేటింగ్ యాప్ నిర్వాహకులకు కూడా ఇదే తమ హెచ్చరిక అని అన్నారు.
బీజేపీ మరో ధర్నా..
ఇక బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో విరార్ ప్రాంతంలో మరో ధర్నా జరిగింది. ఆఫ్తాబ్‌కి ఉరిశిక్ష విధించాలని, ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు యువ మోర్చా నేతలు. ఆఫ్తాబ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మొత్తమ్మీద.. మహారాష్ట్ర యువత, ముఖ్యంగా మహిళలు శ్రద్ధా వాకర్ హత్యపై తీవ్రంగా స్పందిస్తున్నారు. డేటింగ్ యాప్‌ల నిషేధానికి పట్టుబడుతున్నారు.