నారీ శక్తి వందన్ పేరుతో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఇవే కీలక విషయాలు
మహిళా బిల్లు ప్రతులను తమకు ఇవ్వకుండానే ఎలా ప్రవేశపెడతారంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ బిల్లును డిజిటల్ రూపంలో అప్‌లోడ్ చేశామని.. ఎంపీలందరూ వాళ్లకు ఇచ్చిన ట్యాబ్‌లలో చూసుకోవచ్చని చెప్పారు.
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు 'నారీ శక్తి వందన్' పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ బిల్లుకు సోమవారమే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వినాయక చవితి సందర్భంగా పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త భవనంలోకి మారిన తర్వాత తొలి బిల్లుగా దీన్నే ప్రవేశపెట్టడం గమనార్హం. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ 'నారీ శక్తి వందన్' బిల్లును ప్రవేశపెడుతున్నట్లు లోక్‌సభలో ప్రకటించారు.
కాగా, మహిళా బిల్లు ప్రతులను తమకు ఇవ్వకుండానే ఎలా ప్రవేశపెడతారంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ బిల్లును డిజిటల్ రూపంలో అప్‌లోడ్ చేశామని.. ఎంపీలందరూ వాళ్లకు ఇచ్చిన ట్యాబ్‌లలో చూసుకోవచ్చని చెప్పారు. సెప్టెంబర్ 20(బుధవారం) నుంచి లోక్‌సభలో మహిళా బిల్లుపై చర్చ జరుగనున్నది. ఇక సెప్టెంబర్ 21(గురువారం) రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. మహిళా బిల్లును ప్రవేశపెడుతున్నట్లు మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రకటించిన అనంతరం.. ప్రత్యేక సమావేశాల్లో ఏయే బిల్లులను చర్చకు రానున్నాయో లోక్‌సభ సెక్రటరీ జనరల్ చదివి వినిపించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
మహిళా రిజర్వేషన్లు 15 ఏళ్లేనా?
మహిళలకు చట్ట సభల్లో 33 శాతం కోటాను అమలు చేయడానికి ప్రవేశపెట్టిన నారీ శక్తి వందన్ బిల్లుపై రేపటి నుంచి చర్చ జరుగనున్నది. ఈ బిల్లు ఇరు సభల్లో పాసైన తర్వాత .. అన్ని రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదానికి పంపించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదిస్తే ఇది చట్ట రూపం దాలుస్తుంది. కాగా.. మహిళా రిజర్వేషన్ల కోసం లోక్‌సభ, అసెంబ్లీల పునర్విభజన ప్రక్రియ కూడా పూర్తి కావాలని తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి రాజ్యంగంలోని 128 ఆర్టికల్ సవరణ చేయాలి. దీనికి సంబంధించిన అమెండ్‌మెంట్ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.
2021 సెన్సెస్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అయితే ఇంకా జనగణన పూర్తి కాలేదు. ఇది పూర్తయిన తర్వాతే పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానున్నది. మొత్తానికి 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే ఈ కోటా అమలులోకి వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ రిజర్వేషన్లు కేవలం 15 ఏళ్ల పాటు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తున్నది. అంతే కాకుండా ప్రతీ ఎన్నికల్లో రొటేషన్ ప్రకారం మహిళలకు రిజర్వుడు స్థానాలు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.
మహిళలకు రిజర్వేషన్ కల్పించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు : ప్రధాని మోడీ
పార్లమెంట్ కొత్త భవనంలోకి అడుగుపెట్టిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు. చంద్రయాన్-3 విజయం పట్ల భారతదేశం గర్విస్తోందని అన్నారు. కొత్త తీర్మానంతో కొత్త భవనంలోకి వచ్చాము. చేదును మరిచి ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ గొప్ప భవనాన్ని నిర్మించిన కార్మికులు, ఇంజినీర్లకు మనందరి తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మోడీ అన్నారు.
స్వేచ్ఛకు మొదటి కిరణమైన సెంగోల్ ఇక్కడ కొలువు తీరింది. భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ చేపట్టిన సెంగలో ఇది. ఈ సెంగోల్ మనల్ని గతంతో కలుపుతుందని వ్యాఖ్యానించారు. మహిళా సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు. వారికి సరైన అవకాశాలు ఇవ్వాలని మోడీ చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించే భాగ్యం తనకు వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మోడీ చెప్పారు. మహిళలు చరిత్ర సృష్టించాల్సిన సమయం ఇదని.. ఈ రోజు మన ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ మహిళా బిల్లుతో పాటు అనేక పవిత్ర పనులకు నన్ను ఎంపిక చేశాడని మోడీ భావోద్వేగంగా చెప్పారు.
♦