Telugu Global
WOMEN

పెన్షన్ స్కీమ్ లకు మహిళా ఉద్యోగులు దూరం.. ఎందుకంటే..?

నేషనల్ పెన్షన్ సిస్టమ్ లెక్కల ప్రకారం పెన్షన్ స్కీమ్ ల పట్ల మహిళల ఆసక్తి మరీ తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 2023 మార్చి నెలాఖరు ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి కేవలం 22శాతం మంది మహిళలు మాత్రమే పెన్షన్ స్కీమ్ ని ఉపయోగించుకున్నారు.

పెన్షన్ స్కీమ్ లకు మహిళా ఉద్యోగులు దూరం.. ఎందుకంటే..?
X

ఉద్యోగ విరమణ తర్వాత జీవితం ఒడుదొడుకులు లేకుండా సాగేందుకు పెన్షన్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇప్పుడు పెన్షన్ స్కీమ్ లలో మార్పులు వచ్చేశాయి. ఏకమొత్తంగా సెటిల్మెంట్ జరుగుతుంది. ఇక ప్రైవేటు ఉద్యోగుల సంగతి సరే సరి. పెన్షన్ స్కీమ్ లు ఎంపిక చేసుకుని వాటిలో నెలనెలా కొంత మొత్తం జమ చేస్తేనే 60ఏళ్ల తర్వాత మనకి ఆసరా లభిస్తుంది. సాధారణ పౌరులకోసం కూడా కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. పథకాలేవయినా మహిళల ప్రాతినిధ్యం మాత్రం మరీ తీసుకట్టుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే రిటైర్మెంట్ వయసు తర్వాత మహిళలు ఆర్థిక భరోసా గురించి పెద్దగా ఆలోచించట్లేదని అర్థమవుతోంది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ లెక్కల ప్రకారం పెన్షన్ స్కీమ్ ల పట్ల మహిళల ఆసక్తి మరీ తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 2023 మార్చి నెలాఖరు ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి కేవలం 22శాతం మంది మహిళలు మాత్రమే పెన్షన్ స్కీమ్ ని ఉపయోగించుకున్నారు. కార్పొరేట్ ఉద్యోగులు తీసుకుంటున్న పెన్షన్ పథకాల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం నామమాత్రమే. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ(PFRDA) లెక్కల ప్రకారం కార్పొరేట్ ఉద్యోగుల్లో మహిళలు 26శాతం మంది మాత్రమే పెన్షన్ స్కీమ్ లను ఉపయోగించుకుంటున్నారు. అటల్ పెన్షన్ యోజనలో మాత్రం పురుషులు 54శాతం కాగా, మహిళలు 46శాతంగా ఉన్నారు.

మహిళలకు అవసరం.. కానీ..!

వాస్తవానికి మహిళలకు పెన్షన్ స్కీమ్ లు అత్యవసరం అని అంటున్నారు నిపుణులు. పురుషులతో పోల్చి చూస్తే మహిళల సగటు జీవనకాలం ఎక్కువ. అందుకే వారికే పెన్షన్ స్కీమ్ ఎక్కువ అవసరం. కానీ భారత్ లో ఉన్న కుటుంబ వ్యవస్థ, మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా ఇంకా వారి ఆలోచనా ధోరణి పూర్తిగా మారలేదు. పెన్షన్ స్కీమ్ లు పురుషులు, మహిళలు ఇద్దరికీ అత్యవసరం అని వారు భావించట్లేదు. అందుకే మహిళలు రిటైర్మెంట్ తర్వాత జీవనం అనే దానిగురించి ఆలోచించట్లేదు. దీంతో పెన్షన్ స్కీమ్ లలో చేరేవారు, పెట్టుబడులు పెట్టే మహిళల సంఖ్య భారత్ లో బాగా తక్కువగా ఉంది. మహిళలు సంపాదనలో పురుషులతో పోటీ పడుతున్నా.. సేవింగ్ స్కీమ్స్, బీమా, ఇతర పెన్షన్ స్కీమ్స్ వంటి విషయాల్లో పురుషులకే నిర్ణయాధికారం ఇచ్చేస్తున్నారు. అందుకే పెన్షన్ స్కీమ్ లలో వారి ప్రాతినిధ్యం తగ్గిపోతోంది.

First Published:  4 Sept 2023 10:26 AM IST
Next Story