Telugu Global
National

విమాన ప్రయాణంలో రాళ్ల భోజనం

ఎయిరిండియాను ట్యాగ్‌ చేస్తూ ట్విట్టర్ లో మండిపడింది సంగ్వాన్. ఈ ట్వీట్‌ వైరల్‌ అయింది. ఎయిరిండియాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

విమాన ప్రయాణంలో రాళ్ల భోజనం
X

రోడ్డు పక్కన కాకా హోటల్ భోజనంలో రాయి కనపడితే అరచి గగ్గోలు పెడతారు కొందరు, సర్లేవోయ్ నువ్విచ్చే డబ్బులకి రాళ్లు కాక రత్నాలు వేస్తారా అంటూ జోకులు పేలుస్తారు ఇంకొందరు. విమాన ప్రయాణం అంటే కాస్త ఖర్చుతో కూడుకున్నదే కదా, అలాంటిది అందులో ఇచ్చే భోజనంలో కూడా రాళ్లు వస్తే ఆ నిర్లక్ష్యాన్ని ఏమనాలి. ఏ సంస్థ అయినా దాన్ని సమర్థించుకోగలదా..? అలాంటి నిర్లక్ష్యమే ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికురాలికి ఎదురైంది. ఒకటీ రెండు కాదు.. పదుల సంఖ్యలో రాళ్లు కనపడ్డాయి. దాన్ని ఫొటోతీసి ట్విట్టర్లో పెట్టి నానా హంగామా చేసింది ఆ ప్రయాణికురాలు.

శార్వప్రియ సంగ్వాన్‌ అనే మహిళకు ఇలా రాళ్ల భోజనాన్ని వడ్డించారు ఎయిరిండియా సిబ్బంది. ‘‘రాళ్లు లేని భోజనాన్ని అందించేందుకు అదనపు డబ్బు, వనరులు అవసరం లేదు కదా. ఎయిరిండియా విమానంలో నాకు వడ్డించిన భోజనంలో ఈ రాళ్లు వచ్చాయి. సిబ్బందికి ఫిర్యాదు చేశా. ఈ నిర్లక్ష్యం ఏమాత్రం సరికాదు.’’ అంటూ ఎయిరిండియాను ట్యాగ్‌ చేస్తూ ట్విట్టర్ లో మండిపడింది సంగ్వాన్. ఈ ట్వీట్‌ వైరల్‌ అయింది. ఎయిరిండియాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ఆందోళనకర విషయమమని, దీనిపై కేటరింగ్‌ టీమ్ తో మాట్లాడుతున్నామని ఎయిరిండియా బదులిచ్చింది. ఈ ఘటన ఈనెల 8న జరుగగా.. ఎయిరిండియా సమాధానంతో ఇప్పుడిది వైరల్ గా మారింది.


విమానయానంలో వరుస ఘటనలు..

ఇటీవల విమాన ప్రయాణాల్లో వరుస సంఘటనలు సంచలనంగా మారుతున్నాయి. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చే ఎయిరిండియా విమానంలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్రవిసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. మరో ఘటనలో తోటి ప్రయాణికురాలి దుప్పటిపై మరొకరు మూత్రవిసర్జన చేసిన ఘటన మరింత సంచలనంగా మారింది. ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లే మరో ఫ్లైట్ లో పైలట్ ని కొట్టి, ఎయిర్ హోస్టెస్ ని లైంగికంగా వేధించిన ఘటన కూడా దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనికితోడు నిన్న గో ఫస్ట్ ఎయిర్లైన్స్ సంస్థ 54మంది ప్రయాణికుల్ని బెంగళూరు ఎయిర్ పోర్ట్ లోనే వదిలేసి వెళ్లి షాకిచ్చింది. విమాన ప్రయాణాల్లో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు ఆయా సంస్థల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. తాజాగా రాళ్ల భోజనం వీటికి కొనసాగింపు కావడం విశేషం. ఎయిరిండియా సంస్థ రాళ్ల భోజనాన్ని ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.

First Published:  10 Jan 2023 7:19 PM IST
Next Story