ఫారిన్ వెళ్లేందుకు యువతి కిడ్నాప్ డ్రామా.. తండ్రి నుంచి రూ.30 లక్షలు డిమాండ్
మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన 21 ఏళ్ల కావ్యకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు రాజస్థాన్ కోటాలోని ఓ కోచింగ్ సెంటర్‌లో తల్లిదండ్రులు చేర్చించారు. కుమార్తెతో పాటు మూడు రోజులు హాస్టల్‌లో ఉన్న ఆమె తల్లి తిరిగి మధ్యప్రదేశ్‌లోని సొంత ఊరికి వెళ్లిపోయింది.
ఫారిన్ వెళ్లేందుకు కిడ్నాప్ నాటకమాడి తల్లిదండ్రుల్ని టెన్షన్ పెట్టింది ఓ యువతి. తనను ఎవరో కిడ్నాప్ చేశారని రూ.30 లక్షలు డిమాండ్ చేస్తున్నారని చెప్పింది. తాళ్లతో కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కిన కూతురి ఫొటో చూసిన వెంటనే ఆ తండ్రి భయాందోళనతో వణికిపోయాడు. కోచింగ్ తీసుకోవడానికి వెళ్లిన కూతురు కిడ్నాప్ అయిందంటూ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నకిలీ కిడ్నాప్ వ్యవహారాన్ని బయటపెట్టారు.
రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలివి..
మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన 21 ఏళ్ల కావ్యకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు రాజస్థాన్ కోటాలోని ఓ కోచింగ్ సెంటర్‌లో తల్లిదండ్రులు చేర్చించారు. కుమార్తెతో పాటు మూడు రోజులు హాస్టల్‌లో ఉన్న ఆమె తల్లి తిరిగి మధ్యప్రదేశ్‌లోని సొంత ఊరికి వెళ్లిపోయింది. ఆ తరువాత రెండు మూడు రోజులు ఉండి యువతి తన స్నేహితులను కలిసేందుకు ఇండోర్ వెళ్లిపోయింది. అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. అయితే ఈ విషయం తన తల్లిదండ్రులతో చెప్పలేదు. తాను కోటాలోనే కోచింగ్ తీసుకుంటున్నట్టు పేరెంట్స్ ను నమ్మించింది. ఎక్కడా అనుమానం రాకుండా తరచూ ఫొటోలు, వీడియోలు పంపించేది.
అయితే మార్చి 18న కావ్య తండ్రి మొబైల్ ఫోన్‌కు కొన్ని ఫొటోలు వచ్చాయి. అతడి కుమార్తెను తాళ్లతో బంధించి కిడ్నాప్ చేసినట్లు ఫొటోలు ఉన్నాయి. ఆమెను విడిపించేందుకు రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఆందోళన చెందిన కావ్య తండ్రి హుటాహుటిన కోటా వెళ్లాడు. కుమార్తె కిడ్నాప్ గురించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఫోన్ చేసి యువతిని కాపాడాలని కోరారు. దీంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.
రంగంలోకి దిగిన కోటా పోలీసులు కావ్య అక్కడి నుంచి ఎప్పుడో ఇండోర్‌కు వెళ్లినట్లు గుర్తించారు. ఇద్దరు మగ స్నేహితులతో కలిసి ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. ఆమె స్నేహితురాలిని ప్రశ్నించిన తర్వాత కావ్య కిడ్నాప్ నకిలీ అని నిర్ధారించారు. స్నేహితులతో కలిసి విదేశాల్లో చదువుకునేందుకు ఈ డ్రామా ఆడినట్లు తెలుసుకున్నారు. మరోవైపు కావ్య, ఇద్దరి మగ స్నేహితుల మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయని కోటా పోలీసులు తెలిపారు. అయితే ఆమె ఎక్కడ ఉన్నది ఇంకా తెలియలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడ ఉన్నా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు.