Telugu Global
National

పంజాబ్ లో తుపాకులు, కత్తులతో పోలీసుస్టేషన్ పై దండెత్తిన వేలాదిమంది

అమృత్ పాల్ సింగ్ నాయకత్వంలో జల్ పుర్ ఖైరా నుండి అజ్నాలాకు వేలాది మంది ర్యాలీగా వచ్చారు. తుపాకులు, కత్తులతో వేలాదిగా వచ్చిన అమృతపాల్ సింగ్ అనుచరులను పోలీసులు ఆపలేకపోయారు.ఆందోళనకారులు పోలీసు స్టేషన్ లోకి కూడా చొచ్చుకెళ్ళారు.

పంజాబ్ లో తుపాకులు, కత్తులతో పోలీసుస్టేషన్ పై దండెత్తిన వేలాదిమంది
X

పంజాబ్ లోని అమృత్సర్ లో పోలీసులు అరెస్టు చేసిన 'వారిస్ పంజాబ్ దే' గ్రూప్ చీఫ్ అమృతపాల్ సింగ్ అనుచరుడు లవ్‌ప్రీత్ ను వెంటనే విడుదల చేయాలని, అతనిపై నమోదు చేసిన కేసును తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది అజ్నాలా పోలీసు స్టేషన్ ను ముట్టడించారు.

అమృత్ పాల్ సింగ్ నాయకత్వంలో జల్ పుర్ ఖైరా నుండి అజ్నాలాకు వేలాది మంది ర్యాలీగా వచ్చారు.

తుపాకులు, కత్తులతో వేలాదిగా వచ్చిన అమృతపాల్ సింగ్ అనుచరులను పోలీసులు ఆపలేకపోయారు.ఆందోళనకారులు పోలీసు స్టేషన్ లోకి కూడా చొచ్చుకెళ్ళారు.

బారికేడ్లను బద్దలు కొట్టి, ఫెన్సింగ్ ను తెగ్గొట్టి లోపలికి వెళ్ళారు. లవ్ ప్రీత్ ను విడుదల చేయాలంటూ లౌడ్ స్పీకర్లతో పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు.

కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశార‌ని.. ఒక్క గంటలో కేసును రద్దు చేయకపోతే ఆ తర్వాత‌ ఏం జరిగినా దానికి అడ్మినిస్ట్రేషన్‌దే బాధ్యత అని, మేమేమీ చేయలేమని అమృతపాల్ సింగ్ పోలీసులను హెచ్చరించారు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనకారులను నియంత్రించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మీడియా నివేదించింది.

గతేడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కార్యకర్త దీప్ సిద్ధూ స్థాపించిన 'వారిస్ పంజాబ్ దే' గ్రూపునకు అమృతపాల్ సింగ్ అధిపతి.


First Published:  23 Feb 2023 11:41 AM GMT
Next Story