అక్టోబరు 10 నుంచి ఆఫీసుకు రావాల్సిందే.. - ఉద్యోగులకు విప్రో సమాచారం
కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటివరకు వర్క్ ఫ్రం హోం విధానంలో ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్న ఉద్యోగులకు.. కంపెనీ తాజా నిర్ణయంతో ఇక ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో.. తన ఉద్యోగులను ఇకపై ఆఫీసుకు రావాలని సూచించింది. ఈ మేరకు మంగళవారం ఈ మెయిల్స్ ద్వారా సమాచారం అందించింది. అక్టోబరు 10 నుంచి విప్రో కార్యాలయాలు తెరిచి ఉంటాయని పేర్కొంది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటివరకు వర్క్ ఫ్రం హోం విధానంలో ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్న ఉద్యోగులకు.. కంపెనీ తాజా నిర్ణయంతో ఇక ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిన రోజులను ఈ సందర్భంగా ఆ మెయిల్ సమాచారంలో పేర్కొంది. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఆఫీసు తెరిచి ఉంటుందని, ఆయా రోజుల్లో వారికి నచ్చిన మూడు రోజులు ఆఫీసుకు రావచ్చని తెలిపింది. బుధవారం మాత్రం ఆఫీసులను మూసి ఉంచుతున్నట్టు పేర్కొంది.
ఉద్యోగుల మధ్య టీమ్ స్పిరిట్‌ను పెంపొందించాలనే ఉద్దేశంతోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తన మెయిల్‌లో పేర్కొంది. అయితే ఉద్యోగుల సంఘం నైట్స్ (NITES) మాత్రం కంపెనీ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కనీసం నెల రోజుల సమయం అయినా ఇవ్వకుండా ఉద్యోగులను ఒక్కసారిగా ఆఫీసులకు రమ్మని మెసేజ్ ఇవ్వడం సరికాదని పేర్కొంది. ఉద్యోగులు తమ వర్క్ ప్లేస్‌కి చేరుకొని సర్దుబాటు కావడానికి ఆ మాత్రం సమయం అవసరమని తెలిపింది. ఆఫీసుకు రావడంపై ఎంప్లాయీస్ అభిప్రాయం కూడా తెలుసుకోవాల్సిందని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. మన దేశంలో కోవిడ్ పరిస్థితులు మెరుగుపడటంతో.. ఇప్పుడిప్పుడే పలు ఐటీ సంస్థలు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. గత నెలలో టీసీఎస్ ఇదే విధంగా తన సంస్థ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించింది. ఏ మూడు రోజులు ఆఫీసుకు రావాలనే విషయంలో టీమ్ లీడ్‌లతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.