ఢిల్లీ స్కూళ్లకు చలికాలం సెలవలు పొడిగింపు
ఆదివారం ఢిల్లీలో 1.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన రెండేళ్లలో జనవరి నెలలో నమోదైన అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఇది. దీంతో ఢిల్లీలోని స్కూళ్లకు జనవరి 15 వరకు సెలవలు పొడిగించారు.
ఆమధ్య కరోనా సెలవలు, ఆ తర్వాత కాలుష్యం సెలవలు, తాజాగా చలిపులి సెలవలు.. ఢిల్లీలో స్కూళ్లకు ఈ దఫా సెలవలే సెలవలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఈసారి ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఢిల్లీలోని స్కూళ్లసు సెలవలు పొడిగించారు. ఆదివారం హాలిడే తర్వాత సోమవారం స్కూల్స్ తెరుచుకోవాల్సి ఉన్నా.. మంచు కారణంగా సెలవలను కొనసాగించారు. ఈనెల 15వరకు ఢిల్లీలో స్కూళ్లు మూసేయాల్సిందేనంటూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది.
రెండేళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు..
ఢిల్లీతోపాటు ఉత్తరాదిని చలిపులి వణికిస్తోంది. హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ఢిల్లీలో 1.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన రెండేళ్లలో జనవరి నెలలో నమోదైన అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఇది. దీంతో ఢిల్లీలోని ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. స్కూళ్లకు జనవరి 15 వరకు సెలవులు పొడిగించింది.
ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే 48 గంటల వరకు ఉష్ణోగ్రతలు ఇలానే కొనసాగుతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఆగ్రా, బఠిండా ప్రాంతాల్లో ముందు ఏముందో కనిపించనంతగా పొగమంచు అలముకొని ఉంది. పొగమంచు కారణంగా వివిధ జోన్ల పరిధిలో ఆదివారం 338 రైళ్లు ఆలస్యంగా నడిచాయని, 88 సర్వీసుల్ని రద్దు చేశామని అధికారులు ప్రకటించారు. 31 రైళ్లను దారి మళ్లించారు. విమాన సర్వీసులకు కూడా మంచు అడ్డంకిగా మారింది. ఢిల్లీలో 25 విమాన సర్వీసులు మంచు కారణంగా ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీ వాసులకు శ్వాసకోశ సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి.