Telugu Global
National

ఉద్ధ‌వ్ ఠాక్రేనూ జైలుకు పంపుతారా..!?

శివ‌సేన బాల‌ఠాక్రే వ‌ర్గం అధినేత ఉద్ద‌వ్ ఠాక్రేను జైలుకు పంపేందుకు కుట్ర జ‌రుగుతోందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.ఉద్ధ‌వ్ ఠాక్రే, ఆయ‌న కుటుంబ స‌భ్యుల అక్ర‌మ ఆస్తుల‌పై కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సిబిఐ, ఈడి సంస్థ‌ల‌తో ద‌ర్యాప్తు చేయించాల‌ని బాంబే హైకోర్టులో ఒక పిటిష‌న్ దాఖ‌లు కావ‌డం క‌ల‌క‌లం సృష్ట‌స్తోంది.

ఉద్ధ‌వ్ ఠాక్రేనూ జైలుకు పంపుతారా..!?
X

మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఎటువంటి మ‌లుపులు తిరుగుతాయో చెప్ప‌డం క‌ష్టం. అయితే వాటిని మ‌లుపు తిప్పేందుకు బిజెపి ఎప్పుడూ ముందు వ‌ర‌స‌లోనే ఉంటుంది. ఏక్ నాథ్ షిండే ను ప్రోత్స‌హించి శివ‌సేన‌లో చీలిక తెచ్చిన బిజెపి తాజాగా ఉద్ధ‌వ్ ఠాక్రేపై ఉచ్చు వేస్తోందా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. శివ‌సేన బాల‌ఠాక్రే వ‌ర్గం అధినేత ఉద్ద‌వ్ ఠాక్రేను జైలుకు పంపేందుకు కుట్ర జ‌రుగుతోందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఉద్ధ‌వ్ శివ‌సేన బాల్ ఠాక్రే వ‌ర్గం సీనియ‌ర్ నేత‌, పార్ల‌మెంట్ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ ను చాలా కేసులో ఈడి ఎంక్వైరీ తో జైలుకు పంపింది. మొద‌ట‌ కోటి రూపాయ‌ల‌ని ఆ త‌ర్వాత వంద‌లాది కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణం అంటూ బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది.

ఇప్పుడు ఉద్ధ‌వ్ ఠాక్రే, ఆయ‌న కుటుంబ స‌భ్యుల అక్ర‌మ ఆస్తుల‌పై కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సిబిఐ, ఈడి సంస్థ‌ల‌తో ద‌ర్యాప్తు చేయించాల‌ని బాంబే హైకోర్టులో ఒక పిటిష‌న్ దాఖ‌లు కావ‌డం క‌ల‌క‌లం సృష్ట‌స్తోంది. దాదార్ కు చెందిన గౌరీ భిడే(38) అనే వ్య‌క్తి ఈ పిల్ ను దాఖ‌లు చేశారు. ఠాక్రే లు నిర్వ‌హిస్తున్న ప‌త్రికా ప్ర‌చుర‌ణ‌లు- మార్మిక్ మ్యాగ‌జైన్‌, పార్టీ ప‌త్రిక సామ్నా ల‌కు మాదిరే భిడే కూడా ప్ర‌చుర‌ణా రంగంలో ఉన్న‌ట్టు పేర్కొన్నది.

కోవిడ్ స‌మ‌యంలో ప‌త్రికారంగం కుదేలై అంతా న‌ష్టాలు చ‌విచూడ‌గా ఠాక్రే ప్ర‌చుర‌ణ‌లు మాత్రం లాభాల్లో న‌డిచాయ‌ని, అదెలా సాధ్య‌మ‌ని పిటిష‌న్ లో భిడే ప్ర‌శ్నించారు. న‌ల్ల‌ధ‌నాన్ని ఠాక్రేలు వైట్ మ‌నీగా మార్చుకున్నార‌ని ఆరోపించాడు. ముంబై, రాయ‌గ‌ఢ్‌, ల‌లో ఉద్ధ‌వ్‌, ఆయ‌న భార్య ర‌ష్మీ, కొడుకు ఆదిత్య‌కు కోట్లాది రూపాయ‌ల ఆస్తులు ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

విచిత్ర‌మేమిటంటే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అవినీతి వ్యతిరేక నినాదం "నా ఖావూంగా నా ఖానే దుంగా"తో తాను స్ఫూర్తి పొందానని, ఆదాయానికి మించిన ఆస్తులు, మనీలాండరింగ్ వ్య‌వ‌హారాల్లో ఉన్న మరికొంతమందిని వెలికితీయడంలో కేంద్ర ప్రభుత్వానికి త‌న వంతు సహాయం చేయాలని భావించినట్లు భిడే చెప్పారు.

దీంతో ఈ పిల్ వెన‌క ఎవ‌రి ప్రోత్సాహం ఉండి ఉండ‌వ‌చ్చో తేలిగ్గా ఊహించ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

కాగా, హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన విధానపరమైన అభ్యంతరాలను క్లియర్ చేయాలని న్యాయమూర్తులు ఎస్వీ గంగాపూర్వాలా, ఆర్‌ఎన్ లద్దాలతో కూడిన డివిజన్ బెంచ్ భిడేను ఆదేశించింది. ఈ పిటిషన్‌ను నవంబర్ 16న విచారణకు స్వీకరిస్తామని కోర్టు తెలిపింది.

First Published:  20 Oct 2022 1:52 PM GMT
Next Story