Telugu Global
National

పార్లమెంట్ భవనాన్ని స్పీకర్ ప్రారంభిస్తే వస్తాం.. లేకుంటే లేదు.. - ఎంఐఎం నేత ఒవైసీ

ప్రధాని మోడీ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించకూడదన్నారు. పార్లమెంట్ పై స్పీకర్ కి సర్వాధికారాలు ఉంటాయని.. అందువల్ల కొత్త భవనాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగా ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.

పార్లమెంట్ భవనాన్ని స్పీకర్ ప్రారంభిస్తే వస్తాం.. లేకుంటే లేదు.. - ఎంఐఎం నేత ఒవైసీ
X

పార్లమెంట్‌ నూతన భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని 19 ప్రధాన పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోమని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నూతన పార్లమెంట్ భవనాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కాకుండా మరెవరు ప్రారంభించినా ఈ కార్యక్రమానికి తాము హాజరుకామని ప్రకటించారు.

ఈనెల 28వ తేదీన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కానుంది. అయితే నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదగా కాకుండా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండటంపై విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకత తెలిపాయి. అంతేకాకుండా సావర్కర్ జయంతి రోజున నూతన పార్లమెంట్ భవనం ప్రారంభించడాన్ని కూడా విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరు కామంటూ దేశంలోని 19 ప్రధాన పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి.

కాగా దీనిపై తాజాగా అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించకూడదన్నారు. పార్లమెంట్ పై స్పీకర్ కి సర్వాధికారాలు ఉంటాయని.. అందువల్ల కొత్త భవనాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగా ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. స్పీకర్ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తే తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని ఒవైసీ స్పష్టం చేశారు. అలాకాకుండా మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తాము కూడా పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటామని ఆయన ప్రకటించారు.

కాగా, పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన 19 పార్టీల్లో కాంగ్రెస్, డీఎంకే, ఎండీఎంకే, శివసేన(ఉద్దవ్ వర్గం), ఆప్, సీపీఐ, సీపీఎం, ఎస్పీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, వీసీకే, కేరళ కాంగ్రెస్, ఆర్ఎల్డీ, టీఎంసీ, జనతాదళ్ (యూ), ఎన్సీపీ, ఆర్జేడీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ ఉన్నాయి.

First Published:  24 May 2023 1:26 PM GMT
Next Story