Telugu Global
National

రాహుల్ గాంధీ ఎంపీ పదవిని కోల్పోతారా ?

రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం ఉంటుందా ? లేదా ? అనే చర్చ విస్త్రుతంగా సాగుతోంది. ఆయనకు రె‍ండేళ్ళు జైలు శిక్ష పడింది కాబట్టి ఆయనను ఎంపీగా అనర్హులని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా ?

రాహుల్ గాంధీ ఎంపీ పదవిని కోల్పోతారా ?
X

''దొంగల అందరి ఇంటి పేర్లు మోడీ అనే ఎందుకుంటుంది ?'' అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనకు గుజరాత్‌లోని సూరత్ జిల్లా కోర్టు నిన్న రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

2019లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఓ సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్‌ మాజీ మంత్రి 'పూర్ణేశ్‌ మోడీ' రాహుల్ పై పరువు నష్టం దావా వేశారు.

కాగా , రాహుల్ గాంధీ కి జైలు శిక్ష విధించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది నరేంద్ర మోడీ కక్ష సాధింపులో భాగమని ఆ పార్టీ ఆరోపిస్తోంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో అసలు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం ఉంటుందా ? లేదా ? అనే చర్చ విస్త్రుతంగా సాగుతోంది. ఆయనకు రె‍ండేళ్ళు జైలు శిక్ష పడింది కాబట్టి ఆయనను ఎంపీగా అనర్హులని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా ?

ఎవరైనా ప్రజా ప్రతినిధి ఒక నేరానికి పాల్పడినప్పుడు అనర్హత వేటును ఎదుర్కొనే రెండు సందర్భాలు ఉన్నాయి.

మొదటిది: ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(1) క్రింద దోషులుగా నిర్ధారించబడితే వారు ఆ పదవికి అనర్హులవుతారు.ఇందులో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, లంచం, అత్యాచారం, మహిళల పట్ల క్రూరత్వం వంటి అనేక నేరాలు ఉన్నాయి. రాహుల్ గాంధీకి శిక్ష పడిన సెక్షన్లు దీని కిందికి రావు.

ఇక రెండవది: ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3) కింద దోషిగా నిర్ధారించబడితే, నేరానికి పాల్పడిన వ్యక్తికి కోర్టు రెండు సంవత్సరాలకు తక్కువ కాకుండా జైలు శిక్ష విధిస్తే వారు అనర్హుడిగా ప్రకటించబడతారు. అటువంటి నేరారోపణ రుజువైన‌ తేదీ నుండి ఆరు సంవత్సరాల పాటు అనర్హుడిగా ప్రకటిస్తారు. ఇప్పుడు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించడం వల్ల‌ సాంకేతికంగా ఆయన లోక్ స‌భ సభ్యత్వానికి అనర్హుడిగా మారారని న్యాయ నిపుణులు అంటున్నారు.

గురువారం సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత రాహుల్ గాంధీ తన మొదటి స్పందనలో 'నా మతం సత్యం' అని అన్నారు. మహాత్మా గాంధీని ఉటంకిస్తూ, రాహుల్ ఒక ట్వీట్‌లో, "నా మతం సత్యం , అహింసపై ఆధారపడింది, సత్యం నా దేవుడు, దానిని సాధించడానికి అహింస ఒక మార్గం" అని అన్నారు.

ప్రియాంక గాంధీ కూడా ట్వీట్ చేస్తూ, "రాహుల్ గాంధీ గొంతును నొక్కడానికి భయంకరమైన శక్తులు అన్ని పద్ధతులను ఉపయోగిస్తున్నాయి, కానీ నా సోదరుడు ఎప్పుడూ భయపడలేదు. మేము ఎల్లప్పుడూ నిజమే మాట్లాడతాము. రాహుల్ బలం సత్య శక్తి ఆయన వెనుక కోట్లాది మంది ఉన్నారు'' అని ఆమె అన్నారు.

రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై హైకోర్టులో అప్పీలు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం తెలిపారు. ఒక ట్వీట్‌లో "పిరికిపంద, నియంత బిజెపి ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ , ప్రతిపక్షాలు ఎదుర్కొంటున్నాయి. అదానీ స్కాంపై జెపిసి వేయాలంటూ మేము చేస్తున్న ఆందోళన మోడీ ప్రభుత్వానికి నిద్రపట్టనివ్వడం లేదు. అందుకే ఇలాంటి చర్యలకు పాలపడుతోంది. '' అని ఆరోపించారు.

First Published:  24 March 2023 3:30 AM GMT
Next Story