Telugu Global
National

ప్రతిపక్షాల అనైక్యతే బీజేపీకి కలిసొస్తుందా?

ప్రతిపక్షాల ఐక్యత కోసం కొన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నా.. మమత బెనర్జీ, నితీశ్ కుమార్ వంటి లీడర్లు ముందుకు రావడం లేదు.

ప్రతిపక్షాల అనైక్యతే బీజేపీకి కలిసొస్తుందా?
X

కేంద్రంలో బీజేపీ సర్కారను గద్దె దించాలని అనేక పార్టీలు భావిస్తున్నాయి. కానీ ప్రతిపక్ష పార్టీల మధ్య అనైక్యత లేకపోవడమే పెద్ద శాపంలా మారింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌దిఘి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడం విపక్షాల మధ్య ఐక్యత లేకపోవడాన్ని సూచిస్తోందని ఓ సీనియర్ టీఎంసీ నాయకుడు అభిప్రాయపడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇదే బీజేపీకి బలం కానున్నదని కూడా చెప్పారు.

ప్రతిపక్షాల ఐక్యత కోసం కొన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నా.. మమత బెనర్జీ, నితీశ్ కుమార్ వంటి లీడర్లు ముందుకు రావడం లేదు. తామే నేతృత్వం వహించాలనే ఆశతో.. ప్రతిపక్షాలు నిర్వహించే సదస్సులు, సమావేశాలకు హాజరుకావడం లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు విపక్షాలు కలిస్తే దాదాపు 180 సీట్లను కాపాడుకునే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ఎలాంటి అడుగులు పడటం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలంటే ముందు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారి అంటున్నారు. ప్రస్తుతం కావల్సింది విపక్షాలు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచడమే.. కానీ అది జరుగుతుందని తాను భావించడం లేదని ఆయన చెప్పారు. మమత బెనర్జీ మొదటి నుంచి కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల అలయన్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. వెస్ట్ బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికలో టీఎంసీ ఓటమికి ఈ రెండు పార్టీల పొత్తే కారణం. అందుకే ఆమె ఆ పొత్తును అనైతికం అని చెబుతున్నారు.

ఇక రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ, బీజేడీ పార్టీల్లో ఒక్క బీఆర్ఎస్ తప్ప బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కనపడటం లేదు. కాంగ్రెసేతర పార్టీలతో అలయన్స్ ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. దీని వల్ల రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. కానీ ఒడిషాలోని బీజేడీ, ఏపీలోని వైసీపీ మాత్రం ఆ పొత్తులోకి రావడం లేదు. అవసరం అయితే ఆయా పార్టీలు బీజేపీకే సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

తమిళనాడులోని డీఎంకే మాత్రం కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది. దక్షిణాదిలో బలంగా ఉన్న పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం సులభమే. కానీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టాలంటే కచ్చితంగా పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూపీలోని 80 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లోని 42, ఏపీలోని 25, ఒడిషాలోని 21, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల మధ్య ఎలాంటి పొత్తు ఉండబోదని అంచనా వేస్తున్నారు. ఆయా స్థానాల్లో అక్కడ బలంగా ఉన్న అధికార పార్టీలే ఒంటరిగా పోటీ చేస్తాయి. మరి ఇలాంటి సమయంలో మిగిలిన స్థానాల్లో ఎలాంటి పొత్తులు కుదుర్చుకోవాలనే విషయంపై ప్రతిపక్షాల్లో స్పష్టత రావడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఈ పొత్తుపై స్పష్టత వచ్చి.. విపక్షాలు ఐక్యంగా ఉంటేనే బీజేపీని ఎదుర్కోవడం సులభం అవుతుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

First Published:  6 March 2023 2:28 AM GMT
Next Story