Telugu Global
National

మహిళా రెజ్లర్ల ఉద్యమంపై మోదీ ఇకనైనా మౌనం వీడుతారా?

కనుకనే కపిల్‌దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌, మొహిందర్‌ అమర్‌నాథ్‌ వంటి ప్రముఖ క్రికెటర్లు రెజ్లర్లకు మద్దతుగా గొంతు విప్పారు. ఎంతో కష్టపడి సాధించిన మెడల్స్‌ను గంగానదిలో నిమజ్జనం చేయవద్దని కోరారు. వారికి న్యాయం జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

మహిళా రెజ్లర్ల ఉద్యమంపై మోదీ ఇకనైనా మౌనం వీడుతారా?
X

మహిళా రెజ్లర్ల ఉద్యమంపై మోదీ ఇకనైనా మౌనం వీడుతారా?

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ పై దాఖలయిన ఎఫ్‌.ఐ.ఆర్‌లో ఒళ్ళు గగుర్పాటుకు లోను చేసే అంశాలు వెల్లడవడంతో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడయిన బ్రిజ్‌భూషణ్‌ దాష్టీకం, ఆట మీద ఆసక్తితో వచ్చిన ఆడపిల్లలపై అతని వేధింపుల పర్వం సభ్యసమాజానికి సిగ్గుచేటు. తమకు న్యాయం జరగనపుడు తమకు వచ్చిన మెడల్స్‌ను గంగానదిలో నిమజ్జనం చేయాలన్న తీవ్ర నిర్ణయాన్ని రెజ్లర్లు ఎందుకు తీసుకున్నారో ఎఫ్‌.ఐ.ఆర్‌. లో వెలుగు చూసిన అంశాలు చెప్పకనే చెబుతున్నాయి. అతని వేధింపులు తాళలేక గుంపుగా తిరిగినట్టు రెజ్లర్లు చెబుతున్న అంశాలు మొత్తం భారతీయ క్రీడా ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి లోను చేస్తున్నాయి.

కనుకనే కపిల్‌దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌, మొహిందర్‌ అమర్‌నాథ్‌ వంటి ప్రముఖ క్రికెటర్లు రెజ్లర్లకు మద్దతుగా గొంతు విప్పారు. ఎంతో కష్టపడి సాధించిన మెడల్స్‌ను గంగానదిలో నిమజ్జనం చేయవద్దని కోరారు. వారికి న్యాయం జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

సంఘ్‌ పరివార్‌ పాలనలో ఎవరూ నోరు విప్పే పరిస్థితి లేదు. ధైర్యంగా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రజాస్వామిక వాతావరణం కొరవడింది. రెజ్లర్ల మీద బ్రిజ్‌భూషణ్‌ దాష్టీకాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు. అదే సమయాన అంతర్జాతీయ బరిలో నిలిచి పతకాలు సాధించిన రెజ్లర్లపై దాష్టీకం మీద మౌనంగా ఉండలేకపోతున్నారు. మరీముఖ్యంగా ఎఫ్‌.ఐ.ఆర్‌.లో వెలుగు చూసిన అంశాలని గమనిస్తే ఇపుడెవరూ తటస్థంగా వుండే పరిస్థితి లేదు. అందుకే రెజ్లర్లకు మద్దతు పెరుగుతున్నది. బాలీవుడ్‌కు చెందిన నసీరుద్దీన్‌ షా కూడా రెజ్లర్ల ఉద్యమానికి మద్దతు పలికారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ భవనం ప్రారంభం రోజున తమకు న్యాయం జరగాలని నిరసన తెలుపుతున్న రెజ్లర్లపై పోలీసుల దౌర్జన్యాన్ని నసీరుద్దీన్‌ షా ప్రశ్నించారు. రెజ్లర్ల డిమాండ్ల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి ఏమిటని ప్రముఖ నటి స్వరభాస్కర్‌ సైతం కాషాయ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు.

ధనబలం, అధికార బలంతో ఆడపిల్లల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోడంలో మోదీ ప్రభుత్వ తాత్సారం యావత్‌ ప్రపంచాన్ని విస్తు గొలుపుతున్నది. ‘బేటీ బచావో బేటీ పడావో’ అనే మోదీ నినాదం నేతిబీరకాయ చందం అని చెప్పకనే తెలుస్తున్నది.

తన మీద ఆరోపణలని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తే ఉరి వేసుకుంటానంటూ బ్రిజ్‌భూషణ్‌ చెబుతున్న మాటలు దురుసుతనంతో కూడిన ప్రేలాపనలే. నిన్నమొన్నటి వరకు రెజ్లర్ల ఆరోపణలకు సాక్ష్యాలేవీ అని కొందరు ప్రశ్నించకపోలేదు. రెజ్లర్లను ఒంటరి చేసి వారి మీద దుర్మార్గానికి పాల్పడిన బ్రిజ్‌భూషణ్‌ సాక్ష్యాలను అడగటం మరింత హేయం. అతని మీద ఆరోపణలకు సాక్ష్యాలు లేవని బుకాయిస్తే సరిపోతుందా? మహిళలని ఒంటరిగదుల్లో బంధించి ఇలాగే దౌర్జన్యం చేసి సాక్ష్యాలు లేవని తప్పించుకునే ధోరణి చెలరేగే ప్రమాదం లేదా? బ్రిజ్‌భూషణ్‌ నిర్వాకం పట్ల ఉపేక్షభావం మన సమాజంలో మరిన్ని పెడధోరణులకు దారితీస్తుంది. కనుకనే క్రికెటర్లు, సినిమా వాళ్ళు, రైతులు, ఇతర వర్గాలవారు స్పందిస్తున్నారు.

బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోకపోతే క్రీడా రంగంలోకి ఇకముందు మహిళలు రావడం కుదురుతుందా? క్రీడా ప్రాంగణాల్లో ఇలాంటి పరిస్థితులుంటే ఆడపిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారా? అడగుడుగునా అవమానాలు ఎదుర్కొంటున్న మహిళా రెజ్లర్ల డిమాండ్లపై మోదీ ప్రభుత్వం ఇకనైనా స్పందిస్తుందా? రైతుల ఆందోళనల మాదిరిగా రెజ్లర్ల ఆందోళనలు తారాస్థాయికి చేరుకునేదాకా పట్టనట్టుగా వ్యవహరిస్తుందా? బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోకపోతే ఆందోళనల సెగలు కాషాయ ప్రభుత్వాన్ని అంటకమానవు. నయానా భయానా బెదిరించి మహిళా రెజ్లర్లని బెదరగొట్టలేరు. వారికి మద్దతు ఇస్తే ఏమవుతుందోనని వెనుకంజ వేస్తున్న ఉదారవాదులు, ప్రజాస్వామ్యవాదులు నిశ్శబ్దం వీడి రెజ్లర్ల ఉద్యమానికి మద్దతు పలికే పరిస్థితులు మరింత పెరుగుతాయి. మరింత నష్టం జరక్కముందే మేల్కొవడం శ్రేయస్కరమని బిజెపి మహిళా పార్లమెంటు సభ్యులు మేనకాగాంధీ, ప్రీతమ్‌ ముండే ప్రకటనలు కూడా చెబుతున్నాయి. అయిదు నెలలుగా మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనల మీద ఇకనైనా ప్రధాని మోదీ నోరు విప్పాలన్న డిమాండ్లు స్వపక్షం నుంచి పెరిగే అవకాశముంది. ఈ పరిణామాలని గమనించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇకనైనా మౌనం వీడుతారా? రెజ్లర్ల డిమాండ్లకు తలవొగ్గుతారా? వేచి చూడాలి మరి!

First Published:  2 Jun 2023 5:35 PM IST
Next Story