Telugu Global
National

బీజేపీపై ఉన్న ఆ ముద్ర పోతుందా? రాబోయే రెండేళ్లలో దక్షిణాదిలో పరిస్థితి ఏంటి?

ఉత్తరాదిన బలంగా ఉండటమే కాదు.. ఆ పార్టీని నడిపించే అగ్రనాయకత్వం అంతా కూడా ఉత్తరాది వారే ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలో అత్యంత బలమైన ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌కు చెందిన వ్యక్తులు. అందుకే ఆ పార్టీపై 'ఉత్తరాది' ముద్ర తొలగిపోవడం లేదు.

బీజేపీపై ఉన్న ఆ ముద్ర పోతుందా? రాబోయే రెండేళ్లలో దక్షిణాదిలో పరిస్థితి ఏంటి?
X

దేశంలో అనేక జాతీయ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. పలు రాష్ట్రాల్లో బలంగా పాతుకొని పోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అనేక దశాబ్దాలు దేశాన్ని ఏలింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ బలంగానే ఉన్నది. ప్రస్తుతం కూడా కేంద్రంలో ఈ రెండు పార్టీల మధ్యే పోటీ నడుస్తోంది. అయితే.. కాంగ్రెస్‌ను ఎవరూ ఉత్తరాది పార్టీ అని పిలవరు. అన్ని రాష్ట్రాల ప్రజలు దాన్ని ఓన్ చేసుకున్నారు. బీజేపీ మాత్రం ప్రస్తుతం అత్యంత బలంగా ఉన్నా.. ఇప్పటికీ 'ఉత్తరాది పార్టీ' అనే ముద్రను మాత్రం వదిలించుకోలేక పోతున్నది.

ఉత్తరాదిన బలంగా ఉండటమే కాదు.. ఆ పార్టీని నడిపించే అగ్రనాయకత్వం అంతా కూడా ఉత్తరాది వారే ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలో అత్యంత బలమైన ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌కు చెందిన వ్యక్తులు. అందుకే ఆ పార్టీపై 'ఉత్తరాది' ముద్ర తొలగిపోవడం లేదు. రాబోయే రెండేళ్లలో దక్షిణాదిలో బలంగా మారాలని, కనీసం రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. కర్నాటక తప్ప మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి ఆదరణ అంతంత మాత్రమే. ప్రస్తుతం ఆ పార్టీనే కర్నాటకలో అధికారంలో ఉన్నా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వస్తుందనే నమ్మకం మాత్రం లేదు.

ఇక ఎప్పటి నుంచో తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక స్థానమే గెలిచిన బీజేపీ... ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం నాలుగు సీట్లు గెలిచి ఆశ్చర్యపరిచింది. ఇక అప్పటి నుంచి దూకుడుగా వెళ్తున్న తెలంగాణ బీజేపీ.. ఉపఎన్నికల్లో మరో రెండు సీట్లు గెలిచింది. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జాతీయ నాయకత్వం సూచనల మేరకు క్షేత్ర స్థాయిలో పలు కార్యక్రమాలు చేపట్టింది. అయితే, 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు మాత్రం దొరకడం లేదు. పది పదిహేను చోట్ల పాపులర్ నాయకులు ఉన్నా.. మిగిలిన సెగ్మెంట్లలో అభ్యర్థుల కోసం ఇప్పటికీ వేట కొనసాగిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టమేనని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

ఏపీలో బీజేపీకి కనీసం డిపాజిట్లైనా దక్కుతాయనే నమ్మకం అక్కడి పార్టీ నాయకుల్లో లేదు. అధికార వైసీపీ బలంగా ఉండగా... టీడీపీ, జనసేన కూడా అధికారం కోసం పోటీ పడుతున్నాయి. జనసేన పార్టీతో పొత్తుకోసం టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. బీజేపీ మాత్రం జనసేన తమతోనే కలిసి వస్తుందని చెబుతోంది. ఈ క్రమంలో ఆ మూడు పార్టీలు ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకుంటారనే డైలమా ఎన్నికల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా సీట్లు గెలవడం మాత్రం కష్టమే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఏపీనిపెద్దగా పట్టించుకోనట్లే కనపడుతున్నది.

ఇక తమిళనాడు, కేరళలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమే. అధికార డీఎంకే పార్టీ ఎన్నడూ లేనంత బలంగా ఉన్నది. ఇక జయలలిత మరణం తర్వాత ఏఐడీఎంకే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. డీఎంకే అక్కడ బలంగా ఉన్నన్ని రోజులు బీజేపీ గెలిచే పరిస్థితి ఉండదు. ఇక కేరళలో బీజేపీ పాగా వేయాలంటే చాలా కష్టపడాలి. మొత్తంగా దక్షిణాదిలో ఉన్న ఐదు రాష్ట్రాలతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికారంలోకి రావాలంటే బీజేపీకి ఇప్పుడున్న బలం, బలగం సరిపోదు. కర్నాటక, తెలంగాణలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా చాన్స్ లేదు. తెలంగాణలో కూడా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొనే అవకాశం ఉండటంతో ఇప్పటికే దక్షిణాదిలో పాగా వేయాలనే బీజేపీ కల నెరవేరే సూచనలు, ఆ పార్టీపై ఉత్తరాది ముద్ర పోయే అవకాశం కనిపించడం లేదు.

First Published:  19 Feb 2023 10:35 AM IST
Next Story