భవిష్యత్ రాజకీయాలను బిహార్ మరోసారి మలుపు తిప్పనుందా..!?
ప్రస్తుతం బీహార్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు భారత భవిష్యత్తు రాజకీయాలను మలుపుతిప్పనున్నాయా ? 1970 దశకం నుండే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉద్యమాలు బీహార్ నుండి వచ్చాయి. అప్పటి జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం మొదలు కొని నిన్న మొన్నటి అగ్నిపథ్ ఉద్యమం దాకా బీహార్ ముందు వరసలో ఉంది.
భారత రాజకీయాల్లో మార్పునకు మరోసారి బిహార్ కేంద్ర బిందువుగా మారనున్న సంకేతాలు కనబడుతున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 1970 దశకం నుంచి బిహార్ పలు ఉద్యమాలలో కీలక పాత్ర పోషించింది. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం మొదలు నిన్న మొన్నటి అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనల వరకు రాజకీయ ఉద్యమాల్లో బీహార్ స్ఫూర్తి కొనసాగుతూ వస్తోంది. లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ (జెపి) స్వాతంత్య్రోద్యమం తర్వాత పెద్ద ఎత్తున నడిపిన ఉద్యమాలలో బిహార్ మూమెంట్ ఒకటి. బీహార్ రాష్ట్రంలో 1974 ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల కొరతతో తీవ్ర సంక్షోభంఏర్పడింది. ప్రజల కడగండ్లను పట్టించుకోలేని ప్రభుత్వం పై జెపి ఉద్యమించారు. సామాజిక న్యాయం కోసం జయప్రకాష్ నారాయణ్ పిలుపు నిచ్చి ప్రజలను ఉద్యమబాట పట్టించారు. బీహార్ అసెంబ్లీని రద్దు చేయాలనే డిమాండ్ తో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఆందోళనకారులపై క్రూర పద్ధతులు అవలంభించి ఉద్యమాన్ని అణచివేసేందుకు సర్వశక్తులు ఒడ్డింది. ఇంతటితో ఆగకుండా జెపి దేశవ్యాప్తంగా సంపూర్ణ విప్లవం రావాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం బిహార్ మూమెంట్ గా పేరు పొందింది. వి.ఎం తా ర్కుండేతో కలిసి, ఆయన 1974లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ని,1976లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్‌ను స్థాపించారు, ఈ రెండూ స్వచ్చంద సంస్థలుగా పౌర హక్కుల సమర్థన, పరిరక్షణ కోసం పాటుపడ్డాయి,
అనంతరం 1975 లో(జూన్ 25) ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మహోద్యమమే నడిపించారు. ఇది కూడా బిహార్ నుంచి జెపి సారధ్యంలో జరిగింది. ఆ తర్వాత ఇందిరా గాంధీ 1977 జనవరి 18న ఎమర్జెన్సీని రద్దు చేసి ఎన్నికలను ప్రకటించారు. ఇందిరాగాంధీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో ఆయన మార్గదర్శనంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 1977 లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి కాంగ్రెసేతర పార్టీగా జనతా పార్టీ అవతరించింది. జెపి పిలుపు మేరకు ఎందరో యువకులు ఆ నాడు పార్టీలో చేరి అనంతర కాలంలోపేరు ప్రఖ్యాతులు పొందారు. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన జనతా పార్టీ ఆవిర్భావానికి బిహార్ రాష్ట్రం వేదిక అయింది. ఆ తర్వాత 1990లో జరిగిన మండల్ కమిషన్ అనుకూల ఉద్యమం, ఇటీవలి అగ్నిపథ్ వ్యతిరేక ఉద్యమాలు కూడా మొదట చిన్నగా ప్రారంభమై తర్వాత దేశ్వ్యాప్తమైంది కూడా బిహార్ నుంచే కావడం గమనార్హం.
పలు రాజకీయ మలుపులకే గాక కుంభకోణాలు, అరాచకాలతో కూడా బిహార్ దేశం దృష్టిని ఆకర్షించిన సందర్భాలు ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలో బిజెపి ప్రాంతీయ పార్టీలను, రాజకీయ ప్రత్యర్ధి పార్టీలను, ప్రభుత్వాలను కూలదోసుకుంటూ పోతున్న తరుణంలో తాజాగా బీహార్ లో జరిగిన రాజకీయ పరిణామాలు మరోసారి దేశం యావత్తును ఆకర్షించాయి. ముఖ్యంగా బిజెపి విధానాలకి వ్యతిరేకంగా పోరాడుతున్న విపక్షాలకు ఈ పరిణామాలు ఆశాజ్యోతిలా కనిపించాయి. అప్పటివరకు బిజెపితో సఖ్యతతో ఉంటూ ప్రభుత్వాన్ని నడిపిన జెడియూ అధినేత నితీష్ కుమార్ బిజెపితో సంబంధాలను తెంచుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మళ్ళీ పాత మిత్రులు ఆర్జేడీ, కాంగ్రెస్ తదితరులతో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎనిమిదో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు.
తమకు మద్దతు ఇచ్చిన పార్టీలలోనే తిరుగుబాట్లు ప్రోత్సహిస్తూ , ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తూ పోతున్న బిజెకి నితీష్ ఝలక్ ఇచ్చారని దేశ వ్యాప్తంగా విపక్షాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో బిజెపి ప్రభ తగ్గడానికి బిహార్ లో జరిగిన ఈ పరిణామాలే నాంది కాగలవని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా నితీష్ ఉంటారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆయన ఖండిస్తున్నారు. అదే సమయంలో బిజెపి వైఖరిని తూర్పారబడుతున్నారు.
బీహార్ లో పరిణామాల తర్వాత మళ్ళీ ప్రత్యామ్నాయ కూటమి పై ఆశలు మరింతగా పెరుగుతున్నాయి. నితీష్ తో ఈ నేతలంతా కలిసివస్తారనే వార్తలు వినబడుతున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలు ఉండడంతో ఇది చెప్పినంత తేలిక కాదు.
2015లో నితీష్ కుమార్ ప్రమాణస్వీకారానికి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, దేవెగౌడ, కశ్మీర్‌లోని ఫరూక్, ఒమర్ అబ్దుల్లాలు నవ్వుతూ హాజరైనప్పటికీ, వారిని ఏకతాటిపైకి తెచ్చి, ఒక నాయకుడిని ఎన్నుకునేలా వారిని ఒప్పించడం ఒక ఘనకార్యమే అవుతుంది. నితీష్ కుమార్ తదుపరి ప్రధాని రేసులో అభ్యర్థిగా ఫోకస్ అయినా కాకపోయినా భవిష్యత్తు రాజకీయాలకు బిహార్ లో తాజా పరిణామాలు ఎంతోకొంత ఊపునిస్తాయనడంలో సందేహం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి కృషి సలుపుతున్నారు. విపక్షాలన్నింటినీ బిజెపికి వ్యతిరేకంగా ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పడు తాజా పరిస్థితుల్లో మరో సారి బీహార్ నుంచే ఈ ప్రయత్నాలకు మరింత పదును బెట్టి బిజెపికి చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.