జైలునుంచి పాలన.. కేజ్రీవాల్ కేసులో సరికొత్త ట్విస్ట్
ఢిల్లీ మంచినీటి సరఫరా విషయంలో సీఎం కేజ్రీవాల్.. సంబంధిత మంత్రి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఓ నోట్ రూపంలో జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ మార్లీనాకు ఆయన తన ఆదేశాలు పంపించారు.
ముఖ్యమంత్రిగా ఉన్న ఓ నాయకుడు అరెస్టై జైలుకు వెళ్తే ఆ రాష్ట్రంలో పాలన ఎలా జరుగుతుంది..? కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుని వ్యవహారాన్ని నడిపించొచ్చు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఆ విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ జైలునుంచే పాలన కొనసాగిస్తారని ఆ పార్టీ నేతలంటున్నారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆయన.. అక్కడినుంచే పాలన కొనసాగించారని ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ మంచినీటి సరఫరా విషయంలో సీఎం కేజ్రీవాల్.. సంబంధిత మంత్రి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఓ నోట్ రూపంలో జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ మార్లీనాకు ఆయన తన ఆదేశాలు పంపించారు.
Hon'ble Minister @AtishiAAP Addressing an Important Press Conference l LIVE https://t.co/rsqACgKSPb
— AAP (@AamAadmiParty) March 24, 2024
ఇలా కూడా చేయొచ్చా..?
గతంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ సమయంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా.. చాంపై సోరెన్ ని సీఎంగా ఎన్నుకుంది, అక్కడ పాలన కొనసాగుతోంది. కానీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కేజ్రీవాల్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెబుతోంది. ఆయనపై ఆరోపణలు రుజువు కాలేదని, అందుకే సీఎంగా ఆయనే కొనసాగుతారని అంటున్నారు ఆప్ నేతలు.
మరోవైపు కస్టడీ నుంచి పాలన అనేది అసంబద్ధం అంటున్నారు నిపుణులు. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటిస్తే అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే, సీఎంగా ప్రభుత్వాన్ని నడపొచ్చని సీనియర్ అధికారి, ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఉమేష్ సైగల్ తెలిపారు. ఒక వ్యక్తి కారాగారం లోపలి నుంచి ప్రభుత్వాన్ని నడపడానికి జైలు మాన్యువల్ అనుమతించదని స్పష్టం చేశారు. టెక్నికల్ గా తాను పాలన కొనసాగిస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించుకున్నా.. రాజ్యాంగ బద్ధంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.