మళ్లీ అలిగిన అజిత్ పవార్.. వైరి వర్గానికి లొంగిపోతారా..?
అజిత్ పవార్ మాట్లాడాల్సిన సమయం వచ్చే సరికి ఆయన మీటింగ్ నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడ అజిత్ అభిమానులు నినాదాలు చేశారు. ఆయన బాత్రూమ్ కి వెళ్లారని, వెంటనే వస్తారని పార్టీ నేతలు తెలపడంతో అందరూ సైలెంట్ అయ్యారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో అజిత్ పవార్ అలక చర్చనీయాంశంగా మారింది. శరద్ పవార్ అన్న కొడుకుగా ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్, పార్టీ అధ్యక్ష ఎన్నికల సమయంలో తన అలక ప్రదర్శించారు. పార్టీ జాతీయ స్థాయి సమావేశం నుంచి ఆయన అలిగి వెళ్లిపోయారు. దీంతో ఎన్సీపీలో కలకలం రేగింది. పార్టీ అధినేతను ఎన్నుకునే కార్యక్రమంలో అజిత్ వ్యవహారం శరద్ పవార్ కి కూడా మింగుడు పడలేదు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో శరద్ పవార్ ని ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన మరో నాలుగేళ్ల పాటు అధ్యక్షుడిగా ఉంటారు. ఈ కార్యక్రమంలో అజిత్ కంటే ముందు జయంత్ పాటిల్ కు మాట్లాడే అవకాశమొచ్చింది. ఆ తర్వాత అజిత్ మాట్లాడాల్సి ఉన్నా ఆయన స్టేజ్ ఎక్కకుండానే వెళ్లిపోయారు.
అజిత్ లేకపోవడంతో గందరగోళం..
అజిత్ పవార్ మాట్లాడాల్సిన సమయం వచ్చే సరికి ఆయన మీటింగ్ నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడ అజిత్ అభిమానులు నినాదాలు చేశారు. ఆయన బాత్రూమ్ కి వెళ్లారని, వెంటనే వస్తారని పార్టీ నేతలు తెలపడంతో అందరూ సైలెంట్ అయ్యారు. కానీ అజిత్ కాసేపటి తర్వాత కూడా ప్రసంగించేందుకు ఆసక్తి చూపించలేదు. ఆలోగా శరద్ పవార్ ముగింపు ప్రసంగాన్ని మొదలు పెట్టడంతో అజిత్ అక్కడినుంచి వెళ్లిపోయారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ ని ఒప్పించేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. ఆయన అలక అందరికీ అర్థమైంది, శరద్ పవార్ కూడా స్టేజ్ పైనుంచి ఈ వ్యవహారాన్నంతా చూస్తూ ఉండిపోయారు.
కారణం ఏంటి..?
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో కూడా అజిత్ పవార్ ఇలాంటి గందరగోళానికే తెరతీశారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలయికలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది అనుకుంటున్న సమయంలో అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ తో చేతులు కలిపారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆ తర్వాత ఎన్సీపీ నుంచి ఎమ్మెల్యేలెవరూ అజిత్ వర్గంలోకి రావడానికి ఇష్టపడలేదు. అజిత్ కూడా ఎన్సీపీని చీల్చడానికి చివరి వరకూ ప్రయత్నించి కుదరక సొంత గూటికే చేరుకున్నారు. దీంతో ఫడ్నవీస్ బలనిరూపణకు ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అజిత్ పవార్ ఎక్కడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదు. శివసేనలోనే చీలిక వచ్చి ప్రభుత్వం పడిపోయి, కొత్తగా షిండే సీఎం అయ్యారు. ఈ దశలో శివసేనలో లుకలుకలు మొదలయ్యాయే కానీ కాంగ్రెస్, ఎన్సీపీనుంచి ఎవరూ ఆఫర్లకు లొంగలేదు. ఇప్పుడు అజిత్ అలక దేనికి సంకేతం అనేది అర్థం కావడంలేదు. అజిత్ కి బీజేపీ, లేదా షిండే సేన వల వేస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.