Telugu Global
National

మహిళా అనుకూల చట్టాలను సవరించండి.. భార్య బాధిత భర్తల నిరసన

మహిళలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వాలు వెంటనే స్పందిస్తున్నాయని, అయితే సమాజంలో భర్తలను వేధించే భార్యలు కూడా ఉన్నారని.. అటువంటి భర్తలకు న్యాయం చేయడానికి ఎటువంటి చట్టాలు లేవని భార్య బాధిత భర్తలు వాపోతున్నారు.

మహిళా అనుకూల చట్టాలను సవరించండి.. భార్య బాధిత భర్తల నిరసన
X

భార్యలను వేధించే భర్తలకు శిక్ష వేసేందుకు ఎన్నో చట్టాలు ఉన్నాయి.. కొందరు మహిళలు ఈ చట్టాలను ఉపయోగించుకొని గృహహింసకు పాల్పడకపోయినా భర్త, అత్త‌మామ‌లను వేధిస్తున్నారని భార్య బాధిత భర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ విచిత్ర సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జ‌రిగింది. మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఫ్రీడమ్ పార్కులో సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ నేతృత్వంలో భార్య బాధిత భర్తలు ఓ సంఘంగా ఏర్పడి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు.

గృహ హింసకు సంబంధించి మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు అమల్లోకి తెచ్చాయి. ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి వారికి సత్వర న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నాయి. మహిళలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వాలు వెంటనే స్పందిస్తున్నాయని, అయితే సమాజంలో భర్తలను వేధించే భార్యలు కూడా ఉన్నారని.. అటువంటి భర్తలకు న్యాయం చేయడానికి ఎటువంటి చట్టాలు లేవని భార్య బాధిత భర్తలు వాపోతున్నారు.

ఈ సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన నిరాహార దీక్షలో భార్య బాధిత భర్తలు తమ డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చారు. 'విడాకులు తీసుకున్నప్పుడు వారికి పుట్టిన సంతానం ఇద్దరి వద్ద ఉండేలా చట్టాలు సవరించాలి. తప్పుడు కేసులు పెట్టి భర్త, భర్త కుటుంబ సభ్యులను వేధించే మహిళలకు శిక్షలు విధించాలి. వృద్ధులైన అత్తమామలపై కోడళ్లు పెట్టిన కేసులు రద్దు చేయాలి. విడాకులు తీసుకున్న భార్య ఉన్నత స్థితిలో ఉంటే ఆమెకు భరణం ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి. భార్య అత్తింటి వేధింపులు తట్టుకోలేక చనిపోయిన భర్తల కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలబడాలి.

గృహ హింస చట్టంలోని లొసుగులను అడ్డుగా పెట్టుకొని విదేశాల్లో ఉంటున్న భర్త కుటుంబ సభ్యులపై వేధింపులు జరగకుండా చూడాలి. ఎన్నారైల కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలి' అని భార్య బాధిత భర్తలు ప్రభుత్వాన్ని కోరారు. భార్య బాధిత భర్తలంతా ఒక్కచోట చేరి భార్యలకు అనుకూలంగా ఉన్న చట్టాలు సవరించి న్యాయం చేయాలంటూ రెండు రోజులపాటు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేసి నిరాహార దీక్ష చేపట్టడం సంచలనం సృష్టిస్తోంది.

First Published:  28 Feb 2023 7:08 PM IST
Next Story