Telugu Global
National

భార్య గర్భందాల్చింది.. భర్తపై రేప్ కేసు పెట్టారు

వివాహం ముస్లిం చట్టప్రకారమే జరిగినా, 16ఏళ్లకే ఆమె గర్భందాల్చడంతో ఇప్పుడీ వ్యవహారం పోక్సో చట్టం కిందకు వచ్చింది. అందుకే భర్త రెహ్మాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

భార్య గర్భందాల్చింది.. భర్తపై రేప్ కేసు పెట్టారు
X

భార్య గర్భందాల్చడంతో సంతోషంగా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు భర్త. అన్ని పరీక్షలు చేయించి, వైద్యుల సలహా మేరకు ఆమెను కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాడు. కానీ అక్కడే చిన్న చిక్కొచ్చిపడింది. ఆస్పత్రిలో భార్య ఆధార్ కార్డ్ లో వయసు 16ఏళ్లు మాత్రమే ఉంది. దీంతో డాక్టర్ ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. పోలీసులు భర్తపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కోర్టులో భర్త పెట్టుకున్న బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది.

ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కరెక్టే కానీ..

మైనర్లకు వివాహాలు నిషిద్ధం, కానీ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ లో మైనర్లకు వేరే అర్థం ఉంది. బాలికలు 15ఏళ్లు దాటితే వారి పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవచ్చు. తాను కూడా అలాగే ముస్లిం లా ప్రకారం వివాహం చేసుకున్నానంటూ కోర్టుకి చెప్పాడు 31 ఏళ్ల ఖలేదూర్ రెహ్మాన్. 2021 మార్చి 14న ముస్లిం లా ప్రకారం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నానని, అప్పటికి తన భార్యకు 15 ఏళ్లు నిండాయని చెప్పాడు. కానీ కోర్టు అంగీకరించలేదు. ముస్లిం లా ప్రకారం వివాహం జరిగినా, పోక్సో చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

పోక్సో ఏం చెబుతోంది..?

మైనర్లపై లైంగిక నేరాలు, వాటికి అమలు చేయాల్సిన శిక్షల గురించి పోక్సో చట్టం చెబుతోంది. 18 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక దాడి జరిగితే అది నేరం. ఆమె అంగీకారంతో శృంగారం జరిగినా కూడా అది నేరమే. ఈ కేసులో పోక్సో చట్టం కింద భర్తను అందుకే అరెస్ట్ చేశారు. వివాహం చట్టప్రకారమే జరిగినా, 16ఏళ్లకే ఆమె గర్భందాల్చడంతో ఇప్పుడీ వ్యవహారం పోక్సో చట్టం కిందకు వచ్చింది. అందుకే భర్త రెహ్మాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు, బెయిలు కూడా మంజూరు చేయలేదు. ఈ కేసులో కేరళ హైకోర్టు బెయిలు రద్దు చేస్తూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ముస్లిం వివాహ చట్టం పెళ్లి జరిగినా, బాలికలతో లైంగిక సంబంధం కొనసాగించడాన్ని పోక్సో చట్టం నుంచి మినహాయించలేమని తేల్చి చెప్పింది.

First Published:  22 Nov 2022 2:43 AM GMT
Next Story