మోదీ మౌనం దేనికి సంకేతం..?
అసలు మోదీ వ్యూహమేంటి..? 2024 ఎన్నికల విషయంలో దేశవ్యాప్త వ్యతిరేకతను ఆయన ముందుగానే అంచనా వేశారా..? లేక స్పందనతో మరిన్ని కొత్త సమస్యలొస్తాయని గ్రహించారా..?
కర్నాటక ఫలితాలపై సైలెన్స్
రెజ్లర్ల ఆందోళనపై సైలెన్స్
రైలు ప్రమాదంపై విమర్శలు వెల్లువెత్తినా సైలెన్స్
2వేల నోట్ల రద్దుపై వచ్చిన కౌంటర్లకు నో రెస్పాన్స్..
ఇదీ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితి. ఆయనలో మునుపటి ఉత్సాహం లేదు. చీటీకీ మాటికీ మీడియా ముందుకొచ్చి హడావిడి చేసే మోదీ అప్పటిలాగా జోరు చూపించడంలేదు. విమర్శలు వెల్లువెత్తుతున్నా మౌనం వీడటం లేదు. ఒకటీ రెండు కాదు చాలా సందర్భాల్లో మోదీ రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న సామాన్య ప్రజలు కూడా ఆయన స్పందించరంతే అనుకోవాల్సిన పరిస్థితి.
పెద్ద నోట్ల రద్దు విషయంలో అంత హడావిడి చేసి, నానా హంగామా చేసి, చరిత్రను తిరగరాసిన నేతగా బిల్డప్ ఇచ్చిన మోదీ 2వేల నోటుని వెనక్కి తీసుకునే విషయంలో అంతా ఆర్బీఐకే వదిలేశారు. కనీసం తన స్పందన ఏంటనేది బయటకు రానీయలేదు. కర్నాటక పరాజయంపై కూడా బీజేపీ గుంభనంగా ఉంది. కాంగ్రెస్ ని విజేతగా గుర్తించడానికి కూడా మోదీ ఇష్టపడలేదు. స్థానిక బీజేపీ నేతలు మాత్రం కాంగ్రెస్ సర్కారు మూణ్ణాళ్ల ముచ్చటేనంటూ శాపనార్థాలు పెడుతున్నారు కానీ, అధినాయకత్వం.. అందులోనూ మోదీ తనదైన శైలిలో విశ్లేషణ ఇవ్వకపోవడం విశేషం.
రైల్వే వ్యవస్థకు కవచకుండలాలు అమర్చామంటూ కొత్త టెక్నాలజీ అంటూ ప్రచారం చేసుకున్న మోదీ, వందే భారత్ రైళ్లకు పచ్చజెండాలు ఊపడానికి ఇష్టపడే మోదీ.. కోరమాండల్ ప్రమాదం జరిగితే పరామర్శకు వెళ్లారు కానీ, రైల్వేపై వస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇవ్వలేదు. ప్రజలనుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానమే లేదు. పైగా కుట్రకోణం అంటూ సీబీఐ ఎంక్వయిరీతో అసలు విషయం పక్కదారి పట్టిందనే ఆరోపణలు మొదలయ్యాయి.
ఇవన్నీ రాజకీయ విమర్శలే అనుకుందాం, కనీసం భారత రెజ్లర్ల సమస్యపై కూడా మోదీ స్పందించకపోవడమే వింత, విడ్డూరం. పతకాలు తెచ్చినప్పుడు మాత్రం భరతమాత బిడ్డలంటూ మురిసిపోయారు, సమస్య వస్తే ఆ సమస్యకు కారణం బీజేపీ ఎంపీ అని తేలితే మాత్రం ప్రధాని ఇన్నాళ్లూ స్పందించకపోవడం విశేషం. అసలు మోదీ వ్యూహమేంటి..? 2024 ఎన్నికల విషయంలో దేశవ్యాప్త వ్యతిరేకతను ఆయన ముందుగానే అంచనా వేశారా..? లేక స్పందనతో మరిన్ని కొత్త సమస్యలొస్తాయని గ్రహించారా..?