రాహుల్ యాత్రకే నిబంధనలా..? బిజెపికి మాత్రం ఉండవా? కేంద్రమంత్రి లేఖపై కాంగ్రెస్ ఘాటు రిప్లై!
దయచేసి కోవిడ్ ప్రోటోకాల్‌లను ప్రకటించండి, మేము వాటిని అనుసరిస్తాము. కేవలం రాహుల్ గాంధీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, భారత్ జోడో యాత్రకేనా నిబందనలు అని ఖేరా కేంద్ర మంత్రిని ప్రశ్నించారు.
కోవిడ్ -19 ముప్పు పొంచి ఉన్నందున నిబంధనలు పాటించకపోతే భారత్ జోడో యాత్రను ఆపేయాలంటూ కేంద్ర మంత్రి మన్సుఖ్ మండబీయ రాసిన లేఖ పై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. కర్ణాటక, రాజస్థాన్‌లలో బీజేపీ నేతలు కూడా యాత్రలు చేస్తున్నారని, మాండవీయ వారికి కూడా లేఖలు పంపగలరా అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించలేకపోతే భారత్ జోడో యాత్రను సస్పెండ్ చేయాలని మంత్రి రాహుల్ గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
''జన్ అకర్ష్ యాత్ర నిర్వహిస్తున్న బీజేపీ రాజస్థాన్ చీఫ్ సతీష్ పూనియాకు ఇదే సలహా ఇస్తూ లేఖ రాయగలరా? కేంద్రం రాహుల్ గాంధీ యాత్రనే చూస్తుంది తప్పించి, రాజస్థాన్, కర్ణాటకలో బీజేపీ చేపట్టిన యాత్రలు కనబడడంలేదా'' అని విమర్శించారు. బిజెపి నేతలు చేస్తున్న ఈ యాత్రలకు పెద్దగా జనాకర్షణ లేదంటూ దెప్పి పొడిచారు. భారత్ జోడో యాత్రకు విశేష ఆదరణ వస్తోందని, అందుకే బీజేపీ భయపడుతోందని ఖేరా అన్నారు.
''అసలు కొవిడ్ నిబంధనలు ఎక్కడైనా అమల్లో ఉన్నాయా? ఏ విమానాశ్రయానికి అయినా వెళ్లి చూడండి. మాస్క్ ధరించాలని ఎవరూ అడగరు. ఎందుకని ప్రజా రవాణాలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయడం లేదు? రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ కు, భారత్ జోడో యాత్రకు మాత్రమే ఈ నిబంధనలు ఎందుకు? పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసుకున్నారా?'' అని పవన్ ఖెరా ప్రశ్నించారు.
"దయచేసి కోవిడ్ ప్రోటోకాల్‌లను ప్రకటించండి, మేము వాటిని అనుసరిస్తాము. కేవలం రాహుల్ గాంధీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, భారత్ జోడో యాత్రకేనా నిబందనలు " అని ఖేరా కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. ఆయన బుధవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై మండిపడ్డారు.