Telugu Global
National

‘డిజిటల్‌ ఇండియా’ నినాదం ఇచ్చిన‌ మోడీ ‘డిజిటల్‌ మీడియా’ కు ఎందుకు భయపడుతున్నారు ?

ప్రధాని నరేంద్ర మోడీ తన 'న్యూ ఇండియా'ను డిజిటల్ ఇండియాగా చేయాలని నిర్ణయించుకున్నారు. 'డిజిటల్ ఇండియా' నినాదాన్ని ఇచ్చారు. ఈ ప్రచారం కూడా విజయవంతమైంది. ఇప్పుడు భారతదేశం నిజంగానే డిజిటల్‌గా మారింది. ఇప్పుడు ఆ డిజిటల్ ఇండియాను చూసి వారు బెదిరిపోతున్నారు.

‘డిజిటల్‌ ఇండియా’ నినాదం ఇచ్చిన‌ మోడీ ‘డిజిటల్‌ మీడియా’ కు ఎందుకు భయపడుతున్నారు ?
X

గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాని నరేంద్ర మోదీ మీడియానే తన ఆయుధంగా చేసుకున్నారు. ఆ తర్వాత, తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, తన అనుకూల వార్తలు ప్రచారం చేయడానికి, ప్రభుత్వ పథకాలను ప్రశంసించడానికి ప్రధాన స్రవంతి మీడియాను ఉపయోగించారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా బూత్ స్థాయి నుంచి పైదాకా తన హవాను చాటుకుని పార్టీని బలోపేతం చేస్తూ దేశవ్యాప్తంగా తనకు అనుకూలంగా ఎన్నికల వాతావరణాన్ని సృష్టించుకున్నారు.

మోదీ-షాల బీజేపీ సోషల్ మీడియాను తమ ఆయుధంగా చేసుకుని రెండు లోక్‌సభ, డజన్ల కొద్దీ అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులపై దాడి చేసి విజయం సాధించింది. దాని విజయంతో ఉత్సాహంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ తన 'న్యూ ఇండియా'ను డిజిటల్ ఇండియాగా చేయాలని నిర్ణయించుకున్నారు. 'డిజిటల్ ఇండియా' నినాదాన్ని ఇచ్చారు. ఈ ప్రచారం కూడా విజయవంతమైంది. ఇప్పుడు భారతదేశం నిజంగానే డిజిటల్‌గా మారింది. ఇప్పుడు ఆ డిజిటల్ ఇండియాను చూసి వారు బెదిరిపోతున్నారు. తనకు అత్యంత ఇష్టమైన ఈ సోషల్ మీడియా అనే ఆయుధం తననే దెబ్బ తీస్తుందేమో అనే భయం ప్రధాని మోడీకి మొదలైంది.

ఈ భయానికి తాజా ఉదాహరణే 'ఐటీ నిబంధనల సవరణ కొత్త ప్రతిపాదన'. గుజరాత్ అల్లర్లపై ఇటీవలి వివాదాస్పద BBC డాక్యుమెంటరీ తర్వాత ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఇది ఈ డాక్యుమెంటరీకి పరిమితమైనది మాత్రమే కాదు. నిజానికి ఈ ప్రతిపాదనలకన్నా ముందే IT రూల్స్, 2021, రూల్-16లోని అత్యవసర నిబంధనల ప్రకారం బీబీసీ డాక్యుమెంటరీని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి బ్లాక్ చేశారు.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB)లోని ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏదైనా వార్తను 'తప్పు లేదా తప్పుదోవ పట్టించేది' అని గుర్తిస్తే, దానిని సోషల్ మీడియాతో సహా అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి తప్పనిసరిగా తొలగించాలని కొత్త డ్రాఫ్ట్‌లో నిబంధన విధించారు. ఈ పని PIB డైరెక్టర్, అదనపు డైరెక్టర్ జనరల్, డిప్యూటీ డైరెక్టర్ సహా ఐదుగురు సీనియర్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. అంటే మొత్తం PIB ఇప్పుడు ప్రధానంగా ఫాక్ట్ చెక్ మాత్రమే చేస్తుంది.

నిజానికి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాపై ప్రజలకు నమ్మకం పోతోంది. టీవీ చానెళ్లలో రెచ్చగొట్టే చర్చలను ప్రజలు చూడటం మానేశారు. గతంలో న్యూస్ ఛానల్స్ ద్వారా ఏకపక్షంగా ప్రజలకు చేరుతున్న వార్తలు డిజిటల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత తగ్గుముఖం పట్టాయి.

''మెయిన్ స్ట్రీమ్ మీడియాకు దాని స్వంత వ్యాపార నమూనా ఉంది. ఈ నమూనా కారణంగా, ప్రభుత్వం దానిని సులభంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. డిజిటల్ మీడియాకు ప్రత్యేక‌ వ్యాపార నమూనా అంటూ ఏమీ లేదు. ఇది వ్యాపార మీదకన్నా సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. అందుకే దీనిపై ప్రభుత్వం నియంత్రణ చేయలేకపోతోంది.'' అని సీనియర్ జర్నలిస్ట్ పుణ్య ప్రసూన్ బాజ్‌పాయ్ అభిప్రాయపడ్డారు.

మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపడం మానేసిన ప్రజల కష్టాలకు డిజిటల్ మీడియా తన చర్చల్లో చోటు కల్పించడం ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. జర్నలిస్టులు డిజిటల్ వేదికపై బహిరంగంగా మాట్లాడుతున్నారు. ప్రజల సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు.

ఇప్పుడు ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి అనుకూలంగా లేని వాటిని పీఐబీ ద్వారా నిషేధించనున్నారు. వాస్తవానికి ఈ చట్టం అధికారాన్ని పీఐబీ కాకుండా బీజేపీ ఐటీ సెల్ ఉపయోగిస్తుందని పుణ్య ప్రసూన్ బాజ్‌పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐటి సెల్ డిజిటల్ మీడియాలో జరుగుతున్న వార్తలను పర్యవేక్షిస్తుంది. పిఐబి ద్వారా దానిని నిలిపివేస్తుంది అన్నారాయన‌

ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎలా ఉపయోగించగలదో అర్థం చేసుకోవడానికి రెండు సంఘటనలు చూద్దాం... మొదటిది ఏమిటంటే, 'మొదటి దశ ఓటింగ్‌కు పది రోజుల ముందు ఏప్రిల్ 1న, ఫేస్‌బుక్ తన ప్లాట్‌ఫారమ్ నుండి కాంగ్రెస్‌కు సంబంధించిన 687 పేజీలను తొలగించింది. ఇక ఎన్నికలు ముగిసిన ఏడాది తర్వాత రెండో సంఘటన జరిగింది. 2020 జూలైలో ఫేస్‌బుక్ అంతర్గత నివేదికలో 'బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ మైనారిటీల గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో లవ్ జిహాద్ వంటి అంశాలకు ఆజ్యం పోశాయి' అని వెల్లడించింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 'యాంటీ మైనారిటీ', 'యాంటీ-ముస్లిం' వంటి పోస్టులు పుష్కలంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.

అంటే కాంగ్రెస్‌కు సంబంధించిన పేజీలను ఫేస్‌బుక్ తొలగించింది కానీ బీజేపీ ఐటీ సెల్‌కు సంబంధించిన పేజీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2020 ఆగస్ట్‌లో, 'వాల్ స్ట్రీట్ జర్నల్' అనే అమెరికన్ వార్తాపత్రిక తన కథనంలో, 'భారతదేశంలోని ఫేస్‌బుక్ అధికార బిజెపి నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలు, అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది' అని పేర్కొంది.

ఈ వార్త తర్వాత ఫేస్‌బుక్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే రేగింది. ఈ కారణంగా, రాజకీయ కార్యకలాపాల కంటెంట్‌లో నేరుగా జోక్యం చేసుకోవడానికి ఫేస్‌బుక్ ఇప్పుడు భయ‌పడుతోంది. అందుకే ఇప్పుడు ఫేస్‌బుక్‌కు బదులు ప్రభుత్వ వ్యతిరేక వార్తలన్నింటినీ విపక్ష పార్టీల ఐటీ సెల్‌తో సహా ప్రభుత్వ‌ ఆధ్వర్యంలోని సంస్థ పీఐబీ ద్వారా ఆపేందుకు ప్రభుత్వమే సిద్ధమవుతోంది.

ఇది ఫేస్‌బుక్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఈ పనిని తన స్వంత పూచీతో కాకుండా ప్రభుత్వం సూచనల మేరకు, చట్ట పరిధిలో చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలను తప్పుదారి పట్టించేవి, తప్పుడు వార్తలు అని పిఐబి ఫేస్‌బుక్‌కు అందజేస్తుంది. దాని ఆధారంగా ఫేస్‌బుక్ ఆ పోస్ట్ లను తొలగిస్తుంది. ఫేస్ బుక్ ఈ విషయాలపై ఇంతకుముందు ప్రభుత్వాన్ని ఎన్నడూ ప్రశ్నించలేదు. భవిష్యత్తులో కూడా ప్రశ్నించదు. ఎందుకంటే అది ఇక్కడ వ్యాపారం చేయాలి.

PIB ఫాక్ట్ చెక్ యూనిట్ విశ్వసనీయత మీద కూడా అనేక అనుమానాలున్నాయి. 2019లో ప్రారంభమైనప్పటి నుండి, PIB ఫాక్ట్ చెక్ యూనిట్ అనేక‌ వార్తలను తప్పుడుగా ఫ్లాగ్ చేసింది. చాలా వరకు అందుకు ఎటువంటి కారణాలు చెప్పలేదు. దీనికి విరుద్ధంగా, LAC పై చైనా సైనికుల చొరబాటు విషయంలో PIB తప్పుడు సమాచారాన్ని ట్వీట్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై న్యూస్‌లాండ్రీ అనే వెబ్ పోర్టల్ పూర్తి నివేదికను కూడా అందించింది.

'ఐటీ నిబంధనల సవరణ కొత్త ప్రతిపాదన' ద్వారా మోడీ ఇప్పుడు తాను కోరుకున్న 'డిజిటల్ ఇండియాను' మరో రూపంలో ఆవిష్క‌రించబోతున్నారు. ఈ 'డిజిటల్ ఇండియా' ఇండియాకు ఉపయోగపడుతుందా ? లేక మరిన్ని అబద్దాల ప్రచారానికి కారణమవుతుందా ? వేచి చూడాలి.

First Published:  2 Feb 2023 2:44 AM GMT
Next Story