Telugu Global
National

అర్థం కాని సీఈసీ లాజిక్.. ఎలక్షన్ కోడ్ తప్పించడానికే గుజరాత్ షెడ్యూల్ ప్రకటించలేదా?

హిమాచల్‌లో నవంబర్ 12న పోలింగ్ ముగిస్తే.. డిసెంబర్ 8న ఎందుకు కౌంటింగ్ చేస్తున్నారో కూడా స్పష్టంగా చెప్పలేదు.

అర్థం కాని సీఈసీ లాజిక్.. ఎలక్షన్ కోడ్ తప్పించడానికే గుజరాత్ షెడ్యూల్ ప్రకటించలేదా?
X

భారత ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఏ ప్రభుత్వ ఒత్తిడి కూడా దీనిపై ఉండదు. సుప్రీంకోర్టు ఎంత పవర్‌ఫుల్‌గా వ్యవహరిస్తుందో.. ఎలక్షన్ కమిషన్‌ కూడా అంతే స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. కానీ ఇటీవల అధికారంలోని బీజేపీ ఒత్తిడి ఈసీఐపై పడినట్లే కనిపిస్తున్నది. ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు లేదా అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ స్థానికి సంబంధించిన ఉపఎన్నికను గడువుకు ఆరు నెలల లోపు నిర్వహించే అధికారం ఉంది. ఒక వేళ ఏవైనా రెండు, మూడు రాష్ట్రాల అసెంబ్లీల గడువు తక్కువ వ్యవధిలో ముగుస్తుంటే వాటన్నింటికీ కలిపి ఒకే దఫా ఎన్నికలు నిర్వహించిన చరిత్ర కూడా ఉన్నది. కానీ తాజాగా హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎలక్షన్ కమిషన్ గుజరాత్ ఎన్నికల విషయం మాత్రం వదిలేసింది.

గుజరాత్ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించగా.. రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగియడానికి మధ్య 40 రోజుల గ్యాప్ ఉందని, పైగా హిమాచల్‌లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముందుగానే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, హిమాచల్‌లో నవంబర్ 12న పోలింగ్ ముగిస్తే.. డిసెంబర్ 8న ఎందుకు కౌంటింగ్ చేస్తున్నారో కూడా స్పష్టంగా చెప్పలేదు. వాస్తవానికి రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని ఈసీఐ గురువారం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 3.00 గంటలకు మీడియాకు సమాచారం కూడా అందించారు. అయితే చివరి నిమిషంలో ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు గుజరాత్ షెడ్యూల్ ప్రకటించలేదని తెలుస్తున్నది.

40 రోజుల గ్యాప్ ఉండటం వల్ల రెండు రాష్ట్రాలకు ఒకే సారి షెడ్యూల్ ప్రకటించలేదని ఈసీఈ చెబుతున్నారు. వాస్తవానికి గతంలో యూపీ, గోవా అసెంబ్లీ గడుము ముగియడానికి మధ్య 60 రోజుల పైగా సమయం ఉన్నా.. రెండింటికీ ఎన్నికలు ఒకే సారి నిర్వహించారు. మరి అప్పుడు ఈ లాజిక్ ఈసీఈకి గుర్తు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సారి గుజరాత్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పెరిగింది. ఇప్పుడే షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. కొత్త పథకాలు, ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం ఉండదు. అందుకే ముందు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు పూర్తి చేయాలని భావించినట్లు అర్థం అవుతోంది.

హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వచ్చింది. అయితే, హిమాచల్ పోలింగ్, కౌంటింగ్ మధ్య ఉన్న గ్యాప్‌లో గుజరాత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరున షెడ్యూల్ విడుదల చేస్తారని అనుకుంటున్నారు. ఈ లోగా ప్రభుత్వానికి రెండు వారాల వ్యవధి దొరుకుతుంది. ఈ మధ్యలో ఏవైనా పథకాలు, ప్రాజెక్టులు ఉంటే ప్రకటించవచ్చు. అలాగే ఎన్నికల హామీలు కూడా గుప్పించే అవకాశం ఉంది. అదే డిసెంబర్ 8న గుజరాత్ కౌంటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. అందుకే హిమాచల్ ప్రదేశ్ కౌంటింగ్ కూడా పోలింగ్ తర్వాత దాదాపు నెల రోజుల గ్యాప్‌లో నిర్వహిస్తున్నారు.

First Published:  14 Oct 2022 4:44 PM IST
Next Story