Telugu Global
National

సీఎంగారూ.. వైరముత్తుపై చర్యలెందుకు తీసుకోరు..? స్టాలిన్‌కు సింగర్ చిన్మయి ప్రశ్న

'రెజ్లర్లను వేధిస్తున్న బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని మీరు కోరడంలో తప్పులేదు.. అయితే తమిళనాడులో పలువురు మహిళలను వేధించిన వైరముత్తుపై చర్యలు ఎందుకు తీసుకోరు..? అంటూ ప్రశ్నించింది.

సీఎంగారూ.. వైరముత్తుపై చర్యలెందుకు తీసుకోరు..? స్టాలిన్‌కు సింగర్ చిన్మయి ప్రశ్న
X

తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుపై చర్యలు తీసుకోవాలంటూ ప్రముఖ సింగర్ చిన్మయి మరోసారి డిమాండ్ చేసింది. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు కొంతకాలంగా ఆందోళన జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇదే డిమాండ్ తో ఆందోళన కొనసాగిస్తున్న రెజ్లర్లపై ఇటీవల పోలీసులు దాడి చేశారు. కాగా, రెజ్లర్లపై పోలీసులు దాడి చేయడాన్ని తప్పుపడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ట్వీట్ చేశారు. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్నిడిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ కు సింగర్ చిన్మయి ఓ సూటి ప్రశ్న వేసింది. 'రెజ్లర్లను వేధిస్తున్న బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని మీరు కోరడంలో తప్పులేదు.. అయితే తమిళనాడులో పలువురు మహిళలను వేధించిన వైరముత్తుపై చర్యలు ఎందుకు తీసుకోరు..? అంటూ ప్రశ్నించింది. వైరముత్తు మీ పార్టీకి కావలసిన వాడు కాబట్టి అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వైరముత్తు మమ్మల్ని వేధించాడని నాతోపాటు 17 మంది మహిళలు చెప్పారు. దీంతో అతడు నాపై కక్ష కట్టి సినీ ఇండస్ట్రీలో నాకు అవకాశాలు రాకుండా చేశాడు.

వైరముత్తు కారణంగా నేను కోలీవుడ్ నుంచి వెలికి గురికావాల్సి వచ్చింది. వైరముత్తు డీఎంకేకు దగ్గర వాడు కాబట్టి నాకు అన్యాయం జరిగినా మద్దతుగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దయచేసి మీరైనా అతడిపై చర్యలు తీసుకోండి.' అని చిన్మయి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు విజ్ఞప్తి చేసింది.

మీటూ ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడు తొలిసారి చిన్మయి తనకు జరిగిన అన్యాయం గురించి నోరు విప్పింది. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని వెల్లడించింది. అయితే విచిత్రంగా తమిళ సినీ ఇండస్ట్రీ చిన్మయికి అండగా నిలవలేదు. వైరముత్తు సినీ గేయ రచయితగా దిగ్గజ హోదాలో ఉన్నందున ఆయనకే మద్దతుగా నిలిచింది. అప్పటినుంచి సందర్భం వచ్చిన ప్రతిసారి చిన్మయి తనను వేధించిన వైరముత్తుపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ వస్తోంది. తాజాగా మరోసారి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి తీసుకువెళ్ళింది.

First Published:  30 May 2023 12:06 PM IST
Next Story