Telugu Global
National

ఇన్నేళ్ళ స్వాతంత్య్రం తర్వాత కూడా దళితులు, ఆదివాసులకు అన్యాయమే!

75 ఏళ్ళ స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో దళితులు, ఆదివాసుల జీవితాలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. ఆ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలు, వారిపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, వివక్ష గురించి ప్రభుత్వ లెక్కలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం.

ఇన్నేళ్ళ స్వాతంత్య్రం తర్వాత కూడా దళితులు, ఆదివాసులకు అన్యాయమే!
X

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 యేళ్లు పూర్త‌యినా ఆదివాసీలు, ద‌ళితుల‌కు మాత్రం స్వాతంత్య్రం ఫ‌లితం అంద‌డంలేద‌నే అనేక సంఘ‌ట‌న‌లు రుజువుచేస్తుతున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇచ్చిన 'హ‌ర్ ఘ‌ర్ తిరంగా' నినాదం దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న సంద‌ర్భంలోనే ఒడిశాలోని నబరంగ్‌పూర్‌లో ఆదివాసీల ఇళ్లను తగులబెట్టారు. వారి పొలాలను నాశనం చేశారు. రాజస్థాన్‌లోని జాలోరులో ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడి కుండలోని నీరు తాగినందుకు దళిత విద్యార్థిని ఉపాధ్యాయుడు కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన తొమ్మిదేళ్ళ ఆ విద్యార్థి మ‌ర‌ణించాడు. ఈనేపథ్యంలో గిరిజ‌న,ద‌ళిత ప్ర‌జ‌ల జీవ‌న ప‌రిస్థితులు, 2014కు ముందు ఎలా ఉన్నాయి, ఆ త‌ర్వాత కాలంలో ఎలా ఉన్నాయ‌నే విష‌యాలు ప‌రిశీలిద్దాం.

జలోర్, నబరంగ్‌పూర్ వంటి విషాదాలు అరుదైనవి కావు..

భారతదేశంలోని మొత్తం జనాభాలో గిరిజనులు 8.6 శాతంతో దాదాపు 10 కోట్ల మంది ఉన్నారు. భారత రాజ్యాంగం ఆదివాసీ సమాజాన్ని 'షెడ్యూల్డ్ తెగ' కింద వర్గీకరించింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారతదేశంలో సుమారు 65 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని మానవ హక్కుల వర్కింగ్ గ్రూప్ 2012 యుఎన్ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచంలోని అన్నిదేశాల కంటే అత్యధికం. మొత్తం నిర్వాసితుల్లో దాదాపు 40 శాతం (దాదాపు 26 మిలియన్ల) మంది గిరిజన సమాజానికి చెందిన వారేనని ఈ నివేదిక తెలిపింది. అంటే గిరిజనుల మొత్తం జనాభాలో దాదాపు నాలుగో వంతు మంది ఇప్పటివరకు నిర్వాసితులయ్యారు.

ఉపాధి ప‌రిస్థితులు..

గత 6 ఏళ్లలో దాదాపు 5 లక్షల రిజర్వేషన్ ద్వారా వచ్చే ఉద్యోగాలు మాయమయ్యాయి. 2014-15లో రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన 14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపాధి పొందగా, 2020-21లో 9 లక్షల మంది మాత్రమే మిగిలారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయన్నది నిజం. కానీ ఇత‌ర వర్గాల ప్రజలు తమ కుటుంబాల నేపథ్యం కారణంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందగ‌లుగుతున్నారు. కొంద‌రు వ్యాపారాలు కూడా చేసుకోగ‌లుగుతున్నారు. కానీ దళితులు, ఆదివాసీలకు ఈ వెసులు బాటు ఉండ‌దు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోతే వారి అభ్యున్నతి క‌ల‌గానే మిగిలిపోతుంది. మొత్తం ప‌ది ప్రభుత్వ శాఖల్లో 85,777 పోస్టుల్లో 53,293 రిజర్వ్‌డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గ‌త నెల‌లో జ‌రిగిన పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఒక ప్ర‌శ్న‌కు జవాబుగా కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. అంటే మొత్తం రిజర్వేషన్ పోస్టుల్లో 62శాతం ఖాళీలే అన్నమాట‌..

యేడేళ్ళ‌లో 80 వేల పోస్టులు త‌గ్గాయి..

2014-15లో కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, ఇత‌ర‌ విభాగాల్లో 2,28,258 మంది ఆదివాసీలు వేర్వేరు ఉద్యోగాల్లో ఉండగా, 2020-21లో కేవలం 1,47,953 మంది ఆదివాసీలు మాత్రమే పనిచేస్తున్నారు. అంటే 7 ఏళ్లలో 80,305 పోస్టులు తగ్గాయని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ట్రైబల్ ఆర్గనైజేషన్స్ (ఎన్ఎఎసిడిఓఆర్‌)నివేదిక వెల్ల‌డించింది.

ఇక దళితుల విషయానికి వస్తే 2014-15లో 5,18,632 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండగా, 2020-21 నాటికి ఆ సంఖ్య 3,36,927కి తగ్గింది.

దళితులు, ఆదివాసీలపై పెరిగిన నేరాలు

2018-2020 మధ్య గిరిజనులపై నేరాలు 26 శాతం పెరిగాయని పార్లమెంటు ఇచ్చిన సమాచారం తెలిపింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం, 2018లో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)పై దాడులు చేసినందుకు 6,528 అట్రాసిటీ కేసులు నమోదవ‌గా, 2019లో ఈ సంఖ్య 7,570 2020లో 8,272గా ఉంది.

2018లో దళితులపై దాడుల‌కు సంబంధించి 42,793 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, 2019లో 45,935 కేసులు నమోదయ్యాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పార్ల‌మెంటులో తెలిపారు. 2020లో ఈ సంఖ్య 50,291కి పెరిగిందని అజయ్ కుమార్ మిశ్రా గతంలో లోక్‌సభకు తెలిపారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా, జనాభాలో నాలుగింట ఒక వంతు ఉన్న దళితులు, ఆదివాసీలు దౌర్జన్యాలు, దారిద్య్రాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో తొలిసారిగా ఆదివాసీ మ‌హిళ ద్రౌప‌ది ముర్ము రాష్ట్ర‌ప‌తి అయ్యారు. క‌నీసం ఇప్పుడైనా దేశంలోని గిరిజ‌న‌, ద‌ళితుల స‌మ‌స్య‌లు కొన్నైనా తీర‌క‌పోతాయా అని ఆశించ‌డం త‌ప్పు కాదు క‌దా!

First Published:  20 Aug 2022 10:43 AM IST
Next Story