Telugu Global
National

ఉమ్మడి పౌర స్మృతి కోసమే గుజరాత్ కోడ్ ఆలస్యమైందా..?

ఉమ్మడి పౌరస్మృతి అమలు విషయంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దీనికోసం ఓ కమిటీ ఏర్పాటు చేయబోతోంది.

ఉమ్మడి పౌర స్మృతి కోసమే గుజరాత్ కోడ్ ఆలస్యమైందా..?
X

హిమాచల్ ప్రదేశ్ తోపాటు, గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావాల్సి ఉన్నా.. ఉద్దేశపూర్వకంగా దాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకోసం ఇంకా అక్కడ ప్రజలకు ప్రకటించాల్సిన తాయిలాలు బ్యాలెన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఉమ్మడి పౌరస్మృతి అమలు విషయంలో కూడా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దీనికోసం ఓ కమిటీ ఏర్పాటు చేయబోతోంది.

తాజాగా జరిగిన మంత్రి మండలి సమావేశంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంశాఖ సహాయ మంత్రి హర్ష సంఘ్వి కేబినెట్‌ నిర్ణయాన్ని తెలియజేశారు. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకోసం కమిటీ ఏర్పాటవుతుందని చెప్పారు. ఈ కమిటీలో నలుగురు సభ్యులు ఉంటారు. కమిటీలో సభ్యుల్ని ఎంపిక చేసే అధికారం సీఎం భూపేంద్ర పటేల్‌ కు కేబినెట్‌ అప్పగించింది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాక ముందే ఈ కమిటీ ఏర్పాటవుతుంది.

వాస్తవానికి ఉమ్మడి పౌర స్మృతిపై ఇప్పటికే వివాదాలు చెలరేగాయి. ముస్లింల న్యాయ వివాదాల పరిష్కారానికి షరియా చట్టాలే ఆధారం. కానీ ఇకపై ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి వస్తే వారికి ఇబ్బంది కలుగుతుంది అంటున్నారు. కేంద్రం దీనిపై ఆలోచిస్తోంది. ఈ దశలో గుజరాత్ లో బాంబు పేల్చాలనుకుంటున్నారు. అందరికీ ఒకే తరహా చట్టాన్ని అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకూ ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44 చెబుతోందని గుజరాత్ బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. సీఎం భూపేంద్ర తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం ఇదని అంటున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం సంచలనంగా మారింది. అందులోనూ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే ఓ ప్రణాళిక ప్రకారం దీనిపై కమిటీ వేయాలనుకోవడం విశేషం.

First Published:  30 Oct 2022 9:08 AM IST
Next Story