బ్రిజ్ భూషణ్ కేసు.. ఆధారాలు లేవని జరుగుతున్న ప్రచారం నిజం కాదు.. పోలీసుల స్పష్టత
బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించలేదని బుధవారం ఢిల్లీ పోలీసులు ఒక ట్వీట్ చేశారు. అందుకే అతడిని అరెస్టు చేయలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే ఆ ట్వీట్‌ను పోలీసులు వెంటనే డిలీట్ చేశారు.
రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అతడిని అరెస్టు చేయాలంటూ నెల రోజుల నుంచి రెజ్లర్లు ఆందోళన జరుపుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా కేసు దర్యాప్తులో ఉండగానే.. రెజ్లర్లు జరుపుతున్న ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తంగా మారాయి. వారికి మద్దతుగా పలు పార్టీలు సైతం గొంతు విప్పుతున్నాయి.
ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించలేదని బుధవారం ఢిల్లీ పోలీసులు ఒక ట్వీట్ చేశారు. అందుకే అతడిని అరెస్టు చేయలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే ఆ ట్వీట్‌ను పోలీసులు వెంటనే డిలీట్ చేశారు. ఈ విషయమై జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రచురించాయి.
'బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేసేందుకు తగిన ఆధారాలు లభించలేదు. రెజ్లర్ల ఆరోపణలను సమర్థించే అనుబంధ సాక్ష్యాలు కూడా లభ్యం కాలేదు. ఎఫ్ఐఆర్‌లో పొందుపరిచిన పోక్సో సెక్షన్ల కింద నిందితుడిని అరెస్టు చేస్తే ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష ఉంటుంది. అందుకే దర్యాప్తు జరుపుతున్న అధికారులు నిందితుడిని అరెస్టు చేయలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సాక్ష్యాలను కూడా ప్రభావితం చేయడం లేదు. బాధితులను భయపెట్టే ప్రయత్నం చేయలేదు' అని పోలీసులు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై తాజాగా పోలీసులు స్పందించారు. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని వస్తున్న వార్తలు పూర్తిగా తప్పు అని స్పష్టం చేశారు. ఈ కేసు చాలా సున్నితమైన కేసు అని అందుకే జాగ్రత్తగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా తాజా పరిస్థితులను కోర్టుకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది కాబట్టి, ఈ కేసుకు సంబంధించి నివేదికను కోర్టుకు సమర్పించక ముందే దర్యాప్తు అంశాలు వెల్లడించడం సరైంది కాదని పోలీసులు స్పష్టం చేశారు.