హిమాచల్‌లో బీజేపీ ఎందుకు ఓడిపోయింది..? - కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. ప్రజలు ఎందుకు తిరస్కరించారు?
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీనే అధికారంలో ఉన్నప్పటికీ అక్కడి ప్రజల నమ్మకాన్ని ఆ పార్టీ ఎందుకు గెలుచుకోలేకపోయింది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తాజాగా వెలువడిన గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో చారిత్రక విజయం అందుకున్న భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం నెలకొల్పిన రికార్డును సమం చేసింది. గుజరాత్‌లో వరుసగా ఏడోసారి గెలుపొంది ఈ ఘనత సాధించింది. గుజరాత్ అసెంబ్లీ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా ఏకంగా 156 సీట్లతో భారీ విజయాన్ని సాధించి ఆ రాష్ట్రంలో తన బలాన్ని మరోసారి చాటిచెప్పింది. మోదీ, అమిత్ షాల ద్వయం రూపొందించిన ఎన్నికల వ్యూహాలు అక్కడ సత్ఫలితాలు ఇచ్చాయంటూ బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
ఇదంతా ఒకెత్తు అయితే.. గుజరాత్‌తో పాటే జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలైంది. అక్కడ 62 సీట్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు సాధించి అధికార పీఠాన్ని దక్కించుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించే.. 27 సంవత్సరాల సంప్రదాయమే ఈసారీ కొనసాగింది. ఏ పార్టీ కూడా అక్కడ వరుసగా రెండుసార్లు గెలిచిన చరిత్ర లేదు. ఈసారి మాత్రం చరిత్రను తిరగరాస్తామని ఘనంగా ప్రకటించుకున్న బీజేపీకి ఎదురు దెబ్బే తగిలింది. అక్కడి ప్రజలు బీజేపీని తిరస్కరించారు.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీనే అధికారంలో ఉన్నప్పటికీ అక్కడి ప్రజల నమ్మకాన్ని ఆ పార్టీ ఎందుకు గెలుచుకోలేకపోయింది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్‌లో పారిన మోదీ, అమిత్ షాల ఎన్నికల వ్యూహాలు.. హిమాచల్‌లో ఎందుకు ఫలించలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మోదీ, అమిత్ షా, నడ్డాల వంటి నేతల సుడిగాల పర్యటనలు అక్కడ ఎందుకు ఫలించలేదనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.
ప్రధాని స్వయంగా బహిరంగ లేఖ రాసినా..
జైరామ్ ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి పనులు కొనసాగించేలా మరోసారి కమలం గుర్తుకు ఓటేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలనుద్దేశించి స్వయంగా రాసిన బహిరంగ లేఖను కూడా అక్కడి ఓటర్లు పట్టించుకోలేదు. వాస్తవానికి గతేడాది నుంచే బీజేపీ హిమాచల్ ప్రదేశ్‌పై ఫోకస్ పెంచింది. గతేడాది ఒక లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఆ పార్టీ పెద్దలను కలవరానికి గురిచేసింది.
వ్యతిరేకతను ముందే గుర్తించారు..
అధికార పార్టీపై వ్యతిరేకతను అప్పుడే పసిగట్టిన బీజేపీ నష్టనివారణకు నడుం బిగించింది. ప్రధాని మోదీ ఏకంగా ఎయిమ్స్‌తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా చేశారు. గతంలోని ప్రభుత్వాలు శంకుస్థాపనలకే పరిమితమైతే.. బీజేపీ అధికారంలోకి వచ్చాక మాత్రమే అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరాయని ప్రధాని గుర్తుచేసినా ఓటర్లు అవేవీ పట్టించుకోలేదు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. వరుసగా హిమాచల్‌లో పర్యటనలు చేసినా ఫలితం దక్కలేదు.
ఓటర్ల వ్యతిరేకతకు కారణాలివే..!
బీజేపీపై హిమాచల్ ప్రదేశ్ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎన్నికల నాటికి తీవ్రమైంది. నిత్యావసర ధరల పెరుగుదలపై వారిలో నెలకొన్న వ్యతిరేకత బీజేపీకి ఎదురుదెబ్బ తీసింది. సైన్యంలో ప్రవేశాలకు కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ను అక్కడి యువత తీవ్రంగా వ్యతిరేకించింది. అగ్నిపథ్ పథకం వల్ల సైన్యంలో చేరే అవకాశాలు తగ్గిపోతాయని భావించిన యువత వారికి వ్యతిరేకంగా ఓటు చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిమాచల్‌లో యాపిల్ పంటను సాగు చేసే రైతులు, వ్యాపారులు కూడా ప్రభుత్వ విధానాలపై గుర్రుగా ఉన్నారు. సాగు కోసం వాడే పురుగు మందులకు ఇచ్చే సబ్సిడీని బీజేపీ ప్రభుత్వం ఆపేసింది. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా యాపిల్ మార్కెటింగ్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని రైతులు, వ్యాపారులు మండిపడ్డారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో గెలుపోటములను యాపిల్ రైతులు, వ్యాపారులు ప్రభావితం చేశారని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సంకల్ప్ వ్రత్ పేరుతో బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో అక్కడి ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైందని భావిస్తున్నారు. మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో ఏకీకృత పౌర చట్టాన్ని అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, కొత్తగా 8 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలను కూడా ప్రజలు పట్టించుకోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. హిమాచల్‌లో అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ గట్టిగా కష్టపడినా లాభం లేకపోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో ఓటమిపై పోస్టుమార్టంకు ఆ పార్టీ అధిష్టానం రెడీ అవుతోంది.