Telugu Global
National

దేశమంతా ఉత్కంఠ! చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ఎలా ఉండబోతుందంటే..

విక్రమ్ ల్యాండింగ్ విషయంలో ఇస్రో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఒకవేళ అనుకున్నవిధంగా ల్యాండింగ్ అవ్వకపోతే.. వెంటనే మరో ఆల్టర్నేటివ్ ల్యాండింగ్ కోసం కొన్ని అదనపు సెన్సర్లు కూడా అమర్చింది.

దేశమంతా ఉత్కంఠ! చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ఎలా ఉండబోతుందంటే..
X

ఈ రోజు సాయంత్రం 6:04 గంటలకు స్పేస్ సైన్స్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం జరగబోతోంది. మనదేశపు శాటిలైట్ చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవ్వబోతోంది. ఈ చారిత్రాత్మక ఈవెంట్ గురించి మనదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. అసలు ఈ రోజు ఏం జరగబోతోందంటే..

గతనెల 14న ‘చంద్రయాన్ 3’ ప్రయోగం ద్వారా ఇస్రో పంపిన ‘విక్రమ్ ల్యాండర్’ ఈ రోజున చంద్రునిపై దిగబోతోంది. అయితే అది ల్యాండ్ అయ్యేముందు చివరి 17 నిమిషాలు చాలా కీలకమైనవి అని సైంటిస్టులు చెప్తున్నారు. ప్రయోగం సక్సెస్ అయిందా? లేదా? అనేది ఆ చివరి నిమిషాలను బట్టి తెలుస్తుంది. అందుకే దాన్ని ‘టెర్రర్ టైం’ అంటుంటారు.

విక్రమ్ ల్యాండింగ్ విషయంలో ఇస్రో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఒకవేళ అనుకున్నవిధంగా ల్యాండింగ్ అవ్వకపోతే.. వెంటనే మరో ఆల్టర్నేటివ్ ల్యాండింగ్ కోసం కొన్ని అదనపు సెన్సర్లు కూడా అమర్చింది. ఏది ఏమైనా.. ఈ సారి సాఫ్ట్‌ ల్యాండింగ్‌ మాత్రం పక్కా అన్న ధీమాతో ఉంది.

చంద్రుడిపై పరిశోధనల కోసం రీసెంట్‌గా రష్యా ప్రయోగించిన ‘లూనా-25 ల్యాండర్’ కొన్ని రోజుల కిందటే కూలిపోవడంతో చంద్రయాన్‌-3 ల్యాండింగ్ చాలా కీలకంగా మారింది. విక్రమ్‌ ల్యాండింగ్‌ కోసం దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా దీనిపై ఎంతో ఆసక్తితో ఉన్నాయి. ల్యాండింగ్‌ సక్సెస్ అవ్వాలని ముంబయి, బెంగళూరు సహా పలు నగరాల్లో ప్రార్థనలు చేస్తున్నారు.

ల్యాండింగ్ ఇలా..

అంతా అనుకున్నట్టు జరిగితే విక్రమ్ ల్యాండర్‌ నుంచి ‘ప్రగ్యాన్‌’ అనే బుల్లి రోవర్‌ బయటికొస్తుంది. సైడ్‌ ప్యానళ్ల ఆధారంగా చంద్రుడి ఉపరితలంపైకి అది చేరుకుంటుంది. చంద్రుని ఉపరితలంపై 14 రోజుల పాటు ఉండి పలు రకాల అధ్యయనాలు చేస్తుంది. ‘చంద్రయాన్‌-3’ శాటిలైట్ తీస్తున్న ఫొటోలను ఇస్రో ఎప్పటికప్పుడు ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్ చేస్తూ వస్తోంది. విక్రమ్‌ ల్యాండింగ్‌లో కీలకమైన చివరి 17 నిమిషాల ఫూటేజ్‌ను కూడా ఇస్రో టెలికాస్ట్ చేయనుంది.

మిషన్‌ లక్ష్యం ఇదే..

చంద్రుడిపై ఇప్పటివరకూ అమెరికా, చైనా, రష్యా మాత్రమే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయగలిగాయి. అయితే అవి కూడా చంద్రుడి సౌత్ పోల్ వైపు చేరుకోలేకపోయాయి. ఇప్పుడు ఇస్రో ఆ ఫీట్ సాధించబోతోంది. అందుకే చంద్రుడిపై సేఫ్‌గా రోవర్‌‌ను దించడమే ఇస్రో మొదటి లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే చంద్రుడి వాతావరణంపై పలు ప్రయోగాలు నిర్వహించడం వాటి ద్వారా చంద్రుడిపై జీవం వంటి అంశాలపై పరిశోధనలు చేయడం ఇస్రో తదుపరి లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఇస్రో రూ.600 కోట్లు ఖర్చు చేసింది.

ఇస్రో వెబ్‌సైట్‌లో లేదా ఇతర ప్రసార మాధ్యమాల్లో విక్రమ్ ల్యాండిగ్‌ను సాయంత్రం 5:20 గంటల నుంచి లైవ్‌లో చూడొచ్చు.

First Published:  23 Aug 2023 4:09 PM IST
Next Story