అధ్యక్షుడు ఎవరైనా..అజమాయిషీ వారిదే!
కాంగ్రెస్ పార్టీ లో అధ్యక్షపదవి కోసం ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా కాలం తర్వాత గాంధీ కుటుంబయేతర వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడు కాబోతున్నారు. అయితే అధ్యక్షులు ఎవరైనా అధికారాలు మాత్రం గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీది ఓ ప్రత్యేక సంస్కృతి. పార్టీలో ఏవైనా సమస్యలు, సంక్షోభం తలెత్తినప్పుడు నాయకులు తరచూ చెప్పే మాట తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని. కానీ ఒక్కోసారి ఆ ప్రజా స్వామ్యం మరింత ఎక్కువై పార్టీని ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు కూడా అనేకం చూశాం. ఈ నేపథ్యంలోనే పార్టీ అధ్యక్షుడు ఎన్నిక ద్వారానే రావాలని, పార్టీలో సంస్కరణలు చేపట్టాలంటూ కొందరు నాయకులు సోనియా గాంధీ పై ఒత్తిడి తెచ్చారు. మారిన రాజకీయ పరిస్థితులు, తన ఆరోగ్యం, బాధ్యతలు మోసేందుకు రాహుల్ విముఖత కారణంగా ఎన్నికలు నిర్వహించేందుకు సోనియా గాంధీ అంగీకరించారు.
కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబయేతర వ్యక్తి అధ్యక్షుడు కావడం ఖాయమైంది. వ్యక్తి ఎవరైనప్పటికీ ఆయన తన సొంత ఆలోచనలతో పార్టీని నడపగలుగుతారా లేక గాంధీ కుటుంబీకుల అజమాయిషీలో నడుస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అశోక్ గెహ్లాట్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవడం నిశ్చయమైనట్టే. ఆయన నెహ్రూ- గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. అందుకే ఎన్నికల్లో కూడా ఆయన వైపే సోనియా గాంధీ మొగ్గు చూపారంటున్నారు. ఈ ఎన్నికలకు తమ కుటుంబం దూరంగా ఉంటుందని సోనియా చెబుతున్నప్పటికీ ఈ ప్రక్రియ వెనక ఆమె సూచనలు సలహాలు లేకపోలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కొత్త అధ్యక్షుడు వచ్చినా ఆ కుటుంబ సలహాలు స్వీకరించక తప్పని పరిస్థితి.
కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబమే ..అన్నంతగా నాయకులు, ప్రజలు కూడా కట్టుబడిపోయారు. ఆ కుటుంబం తప్ప పార్టీని రక్షించేవారే లేరన్నట్టు సాగిలపడుతుంటారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నా, వచ్చే అధ్యక్షుడు సోనియాగాంధీ సలహాలు విధిగా పాటిస్తారనడంలో సందేహం లేదు. కొత్త సారధిగా ప్రచారంలో ఉన్న అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ లో తలెత్తిన సంక్షోభాన్ని సామరస్యంగా పరిష్కరించలేక నెపమంతా ఎమ్మెల్యేలపై నేట్టేసి తానేమీ చేయలేనని, తన చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేశారు. ఇప్పుడు గెహ్లాట్, సచిన్ పైలట్ లను సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించారు. ఏ పరిష్కారమైనా ఆమె సమక్షంలో ఆమె జోక్యంతోనే జరుగుతుందన్న మాట.
ఇటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి, నాయకులకు కొత్త కాదు. గతంలో కూడా ఇలాగే అనేక సార్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అది పార్టీ వ్యవహారాల్లోనైనా, ప్రభుత్వ వ్యవహారాల్లోనైనా సరే సోనియా (గాంధీ కుటుంబం) జోక్యం లేకుండా ఉండేది కాదు. అప్పుడు కూడా ఆమె అధికారానికి దూరంగానే ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా పివి నరసింహారావు స్వతంత్రంగా వ్యవహరించడానికే ప్రాధాన్యమిచ్చేవారు. ఈ ధోరణి ఆమెకు అంతగా నచ్చేది కాదు. కానీ ఆయన అనుభవం, మేధస్సు దృష్ట్యా అయిష్టంగానే భరించారు. కోర్టు కేసుల కారణంగా పివి రాజీనామా చేయాల్సి రావడంతో ఎంతోకాలంగా కోశాధికారిగా ఉన్న సీతారాం కేసరిని ఆ పదవిలో నియమించారు. ఆయన కూడా గాంధీ కుటుంబ విదేయుడైనందున సోనియా ఆదేశాలను జవదాటకుండానే మెసులుకోగలిగారు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పరిస్థితి కూడా అలానే సాగింది. యుపిఎ చైర్ పర్సన్ హోదాలో సోనియా సూచనలతోనే పలు నిర్ణయాలు జరిగేవి. అంటే సోనియా కానీ ఆమె కుటుంబం కానీ అధికారానికి, పదవులకు దూరంగా ఉన్నప్పటికీ తాము అనుకున్న నిర్ణయాలు, ఆలోచనలే అమలు చేయించుకుంటారని స్పష్టమవుతోంది.
తాజా పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సోనియా, రాహుల్ ప్రాపకం కోసమే పాకులాడుతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఆమె నిర్ణయాలే భవిష్యత్తులో కూడా అమలవుతాయనడంలో సందేహం లేదంటున్నారు. అధ్యక్షుడే పార్టీకి సారధి. ఆయన నిర్ణయాలే శిరోధార్యం కావాలి పార్టీలో అందరికీ. కానీ కాంగ్రెస్ లో ఆ పరిస్థితి ఉంటుందా అనేది సందేహమే.