లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్.. వ్యతిరేకంగా ఓటేసిన వాళ్లిద్దరూ ఎవరంటే..
నారీ శక్తి వందన్ బిల్లుపై ఓటింగ్ ఎలా చేయాలనే వివరాలను లోక్‌సభ సెక్రటరీ జనరల్ అందరికీ వివరించారు. ఆకుపచ్చ, ఎరుపు రంగు స్లిప్పులను అందరికీ అందించారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించిన మహిళా బిల్లు (నారీ శక్తి వందన్)ను లోక్‌సభ ఆమోదించింది. నారీ శక్తి వందన్ బిల్లును మంగళవారం న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. అనంతరం సభ వాయిదా పడింది. ఇక బుధవారం మహిళా బిల్లుపై సభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. దాదాపు 7 గంటల పాటు నారీ శక్తి వందన్ బిల్లుపై చర్చలు జరిపారు. దీనిపై ఓటింగ్ నిర్వహించడానికి కాసేపు ముందు ప్రధాని మోడీ సభలోకి అడుగు పెట్టారు.
నారీ శక్తి వందన్ బిల్లుపై ఓటింగ్ ఎలా చేయాలనే వివరాలను లోక్‌సభ సెక్రటరీ జనరల్ అందరికీ వివరించారు. ఆకుపచ్చ, ఎరుపు రంగు స్లిప్పులను అందరికీ అందించారు. మద్దతు తెలిపితే ఆకుపచ్చ స్లిప్‌పై 'ఎస్' అని, వ్యతిరేకిస్తే ఎరుపు రంగు స్లిప్పుపై 'నో' అని రాయాలని చెప్పారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఈ చారిత్రాత్మక బిల్లు పాస్ అయినట్లు స్పీకర్ చెప్పారు. ఈ బిల్లు కోసం రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉండటంతోనే మాన్యువల్ పద్దతిలో ఓటింగ్ చేపట్టినట్లు తెలిసింది.
కాగా, మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఇప్పటికే ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. సభలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు దీంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఎంఐఎంకి చెందిన ఔరంగాబాద్ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
ఇక రేపు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ కూడా బిల్ పాస్ అవుతుందని బీజేపీ ప్రభుత్వం ధీమా ఉన్నది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ బిల్లును పంపుతారు. దేశంలోని సగం రాష్ట్రాలు ఈ బిల్లుకు అనుకూలంగా తీర్మానం చేస్తేనే బిల్లు పూర్తిగా పాస్ అవుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారుతుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.