Telugu Global
National

''జీతాలు ఇవ్వ‌లేని స్థితిలో ఓ రాష్ట్రం'' - నిర్మ‌ల‌మ్మ‌ చెప్పిన ఆ రాష్ట్రం ఏది?

రాష్ట్రం పేరు చెప్పకుండా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఒక రాష్ట్రముందని ఆర్థిక మంత్రి చెప్పడంతో ఆ రాష్ట్రం ఏది అన్న దానిపై చర్చ మొదలైంది. దేశంలో పలు రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది నిజమే.

జీతాలు ఇవ్వ‌లేని స్థితిలో ఓ రాష్ట్రం - నిర్మ‌ల‌మ్మ‌ చెప్పిన ఆ రాష్ట్రం ఏది?
X

కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశంలోని ఒక రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు. బుధవారం రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆమె..''నేను రాష్ట్రం పేరు చెప్పదలుచుకోలేదు. కానీ, ఆ రాష్ట్రం తన ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది. గత రెండు నెలలుగా ఆ రాష్ట్రం ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించడం లేదన్న దానిపై వార్తలను చూస్తున్నాం. బహుశా ఆ రాష్ట్ర ప్రభుత్వం తన వద్ద ఉన్న డబ్బును దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు ఖర్చు చేసి ఉండవచ్చు'' అంటూ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.

''జీతాలు ఇవ్వలేని స్థితికి వచ్చిన వారు.. తాము ఇచ్చే ఉచితాలు, సబ్సిడీలను బేరీజు వేసుకోవాలి. మీకు ఆదాయం ఉంటే డబ్బులు ఇవ్వండి. అప్పుడు ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఉచితాలు సందర్బోచితంగా ఉండాలి. విద్యా, వైద్యం, వ్యవసాయంపై సబ్సిడీలు ఇవ్వడం సరైనదే'' అని కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు.

రాష్ట్రం పేరు చెప్పకుండా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఒక రాష్ట్రముందని ఆర్థిక మంత్రి చెప్పడంతో ఆ రాష్ట్రం ఏది అన్న దానిపై చర్చ మొదలైంది. దేశంలో పలు రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది నిజమే. కానీ, ఆర్థిక మంత్రి రాష్ట్రం పేరు చెప్పకపోవడంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు.. కేంద్ర మంత్రి చెప్పింది తమ రాష్ట్రం గురించే అంటూ అధికార పార్టీపై విమర్శలకు దిగుతున్నాయి. ఎవరికి వారు భుజాలు తడుముకుంటున్నారు.

First Published:  22 Dec 2022 8:27 AM IST
Next Story