రైలు ప్రమాదంపై దుర్మార్గ ప్రచారం చేస్తున్న వాట్సప్ యూనివర్సిటీ... ఎవరిని రక్షించేందుకు ?
కనీస ఆధారాలు లేని ఆరోపణలతో, కొందరిపై విమర్శలతో దుర్మార్గమైన ప్రచారానికి దిగింది వాట్సప్ యూనివర్సిటీ. రైల్వే ఉద్యోగ సంఘాలు కమ్యూనిస్టు ఉద్యోగ సంఘాలు కాబట్టి, ఆ ఉద్యోగులు కావాలనే ఈ ప్రమాదాన్ని సృష్టించి 280 మందిని చంపేశారని, ఇది కమ్యూనిస్టుల పనే అని సోషల్ మీడియాలో ప్రచారాన్నందుకున్నారు భక్తులు.
మొన్న రాత్రి ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 280 మంది ప్రయాణీకులు మరణించగా వేయి మందికిపైగా గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మూడు రైళ్ళు ఢీకొట్టిన ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది ఇప్పటి వరకు స్పష్టత రాకున్నప్పటికీ సిగ్నలింగ్ వ్యవస్థ లోపమే కారణమయ్యుంటుందని నిపుణులు అంటున్నారు.
మరో వైపు రైల్వేలో ఉండాల్సిన దానికన్నా తక్కువ సిబ్బంది ఉండటం, ఉన్న తక్కువ మందిపై విపరీతమైన పని ఒత్తిడి ఉందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇక ఈ ప్రమాద సంఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ పూర్తయ్యాక ఈప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా? మానవ లోపమా? లేక మరేదైనా కారణముందా అన్నది తేలవచ్చు.
ఇప్పటి వరకు వస్తున్న విమర్శల్లో సాంకేతిక లోపం , మానవ లోపం అనే రెండు కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం విద్రోహ చర్య కూడా కావచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటువంటి ఆరోపణలు ఇప్పటి వరకు దేశంలోనీ మరే పార్టీ కానీ, నాయకులు కానీ చేయలేదు.
ఏదేమైనప్పటికీ ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోందనే విమర్శలు మాత్రం ఊపందుకున్నాయి. రైల్వేల్లో ప్రమాదాలు తగ్గించేందుకు, ముఖ్యంగా ఎదురెదురుగా రైళ్ళు వచ్చినప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌బిఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్, కెర్నెక్స్ మైక్రోసిస్టమ్స్ సహకారంతో రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) రూపొందించిన సాంకేతికతను కవచ్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మార్చ్ లో రైల్వేల్లో ప్రవేశపెట్టింది. అయితే ఆ సాంకేతికతను మొత్తం భారత రైల్వేల్లో వాడకుండా అతి తక్కువ చోట్ల మాత్రమే వాడుతుండటం, దాన్ని విస్తరించడంలో కేంద్ర నిర్లక్ష్యంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరో వైపు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తక్షణం రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా ఊపందుకోంది. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో కేంద్ర బీజేపీ సర్కార్ పై అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముడుతున్నాయి.
ఈ నేపథ్యంలో వాట్సప్ యూనివర్సిటీ మేలుకొని, జూలు విదిల్చింది. కనీస ఆధారాలు లేని ఆరోపణలతో, కొందరిపై విమర్శలతో దుర్మార్గమైన ప్రచారానికి దిగింది. రైల్వే ఉద్యోగ సంఘాలు కమ్యూనిస్టు ఉద్యోగ సంఘాలు కాబట్టి, ఆ ఉద్యోగులు కావాలనే ఈ ప్రమాదాన్ని సృష్టించి 280 మందిని చంపేశారని, ఇది కమ్యూనిస్టుల పనే అని సోషల్ మీడియాలో ప్రచారాన్నందుకున్నారు భక్తులు.
అక్కడితో ఆగలేదు ఈ ప్రమాదానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కూడా ముడిపెడుతూ దుష్ప్రచారానికి దిగారు. రాహుల్ విదేశాలకు వెళ్ళిన సమయంలోనే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ? అని ప్రశ్నిస్తూ కుట్ర పూరితంగా అనుమానాలు రెచ్చగొడుతున్నారు. ముంబై సీరియల్ పేలుళ్ళూ, ఈ రైలు ప్రమాదం రెండూ శుక్రవారమే జరిగాయని చెబుతూ, ప్రమాదం జరిగిన స్థలానికి దగ్గరలో మజీదు ఉందని విషభీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. స్టేషన్ మాస్టర్ ముస్లిం అని, ఆ ప్రమాదానికి అతనే కారణమని ప్రచారం చేస్తున్నారు. నిజానికి వాళ్ళు ప్రచారం చేస్తున్న ఫోటోలో ఉన్నది మజీదు కాదని, అది ఇస్కాన్ టెంపుల్ అని ఒడిశాకు చెందిన పలు ఫ్యాక్ట్ చెక్ మీడియా సంస్థలు స్పష్టం చేశాయి.
విజయ సారథి అనే ఓ సోషల్ మీడియన్ అయితే రైల్వే ఉద్యోగుల మీద, కమ్యూనిస్టుల మీద, కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వచ్చే విధంగా వరస పోస్టులు చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని, రైల్వే మంత్రిని పొగుడుతూ ప్రమాదం తర్వాత రైల్వే మంత్రి అలుపెగకుండా శ్రమిస్తున్నారంటూ ప్రచారం చేస్తూ ఆయన చేసిన పోస్టులు వందల మంది షేర్లు చేశారు. ఇక ఘటన జరిగిన వెంటనే వేలాది మంది యువకులు వచ్చి రక్తదానం చేస్తుంటే...వారంతా తమ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు భక్తులు.
ఒక్క విజయ సారథి మాత్రమే కాక దేశవ్యాప్తంగా అనేక మంది ఇటువంటి అనుమానాల విష భీజాలు నాటే ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా విమర్శించిన వాళ్ళపై కేసులు మోపుతూ జైళ్ళ పాలు చేస్తున్న పాలకులు ఇటువంటి ఆధార రహిత దుష్ప్రచారాలపై నోరు మెదపకపోవడంపై నెటిజనులు మండిపడుతున్నారు.