Telugu Global
National

బాలిలో ప్రధాని చెప్పిందేంటి - దేశంలో జ‌రుగుతున్న వాస్తవాలేంటి ..!?

జి-20 స‌ద‌స్సులో ప్రధాని మోడీ మాట్లాడిన మాటలకు భారత దేశంలో జరుగుతున్న దానికి పొంతన లేదని ప్రముఖ చ‌రిత్ర‌కారుడు ప్రొఫెస‌ర్ రాజ‌మోహ‌న్ గాంధీ అన్నారు. దేశంలో హానికరమైన ఆధిపత్య ధోరణులు కొంతకాలం విజయవంతం కావచ్చు కానీ భారతదేశ ప్రజలు దీనిని ఎల్ల‌కాలం సహిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

బాలిలో ప్రధాని చెప్పిందేంటి - దేశంలో జ‌రుగుతున్న వాస్తవాలేంటి ..!?
X

బాలిలో జ‌రిగిన జి-20 స‌ద‌స్సు సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌లు భార‌త దేశంలో జ‌రుగుతున్న వాస్త‌వ ప‌రిస్థితుల‌కు భిన్నంగా ఉన్నాయ‌ని ప్రఖ్యాత చ‌రిత్ర‌కారుడు, రీసెర్చ్ ప్రొఫెస‌ర్ రాజ‌మోహ‌న్ గాంధీ అభిప్రాయ‌ప‌డ్డారు.

జి-20 సమావేశానికి బాలి చేరుకోవడానికి ముందు, ప్రధాని మోడీ మాట్లాడుతూ, భారతదేశం "ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే మా మంత్రాన్ని ప్ర‌పంచంతో పంచుకోవాల‌ని కోరుకుంటున్న‌ది" అన్నారు. నిజంగా ఇది ఒక అంద‌మైన విశాల‌మైన భావ‌నా దృక్కోణ‌మే. కానీ భారతదేశంలో, జాతీయ కుటుంబం చీలిపోయింది. మెజారిటీ కమ్యూనిటీలో చాలా మంది ముస్లింల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల సంతోషంగా ఉన్నప్పటికీ , రానున్న రోజుల్లో తమ భ‌విష్య‌త్తు లో ఏం జ‌రుగుతుందో ఎలా ఉంటుందో అనే ఆతృత, ఆందోళ‌న లో ఉన్నారు అని రాజ‌మోహ‌న్ పేర్కొన్నారు. తాజాగా ఆయ‌న రాసిన పుస్తకం "ఇండియా ఆఫ్టర్ 1947: రిఫ్లెక్షన్స్ అండ్ రీకలెక్షన్స్ లో రాజ్‌మోహన్ గాంధీ దేశంలోని ప‌రిస్థితుల‌పై త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.

"ముస్లింల సంఖ్య పెరుగుతున్నందున వారి గుర్తింపును త‌గ్గించ‌డానికో, తుడిచివేయడానికో లేదా హిందూవుల‌కు అనుకూలంగా వారిని వినియోగించుకోనేలా చేయ‌డంలో కొందరు విజయం సాధించవచ్చు. కానీ ముస్లింలలో చాలా మంది తమను తాము అలా మార్చుకోలేక‌పోతున్నామ‌ని భావించడం నాకు గ‌ర్వ కార‌ణం కాదు.. అది నాకు సిగ్గుచేటు. అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇందుకు పూణె విమానాశ్ర‌యంలో ఎదురైన ఓ సంఘ‌ట‌న‌ను ఉద‌హ‌ర‌ణ చెబుతూ.. త‌న ప‌క్క‌నే ఉన్న ఒక ముస్లింను ఎలా ఉన్నార‌ని ప‌ల‌క‌రిస్తే .. నేను బాగున్నాను. "భగవాన్ కీ కృపా హై" అని బదులిచ్చాడు. అదే ఇదివ‌ర‌కు ప‌ల‌క‌రిస్తే ఆయ‌న " ఖుదా, అల్లా లేదా ఊపర్ వాలా అని చెప్పి ఉండేవారు క‌దా అనిపించింది." అన్నారు.

అలాగే, క‌ర్ణాట‌క‌లో విద్యా రంగాన్ని కాషాయీక‌ర‌ణ చేస్తున్నార‌నే విమ‌ర్శ‌ల మధ్య రాజ‌మోహ‌న్ మ‌రో అంశాన్ని ప్ర‌స్తావించారు. 8, 000 క్లాస్ రూమ్ ల‌కు కాషాయ‌రంగులు వేయాల‌నుకుంటున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్రకటించినట్లు తెలుస్తోంది. దీనిపై ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నా ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వివేకానందుడి పేరు చెప్పి స‌మ‌ర్ధించుకోవ‌డం విచిత్రంగా ఉంద‌న్నారు.

హిందువులకు కాషాయ రంగు అనేది గౌరవనీయమైన రంగు కావ‌డంతో కొంద‌రు త‌లిదండ్రులు సంతోషిస్తూ ఉండొచ్చు. కానీ ఈ ప్రాజెక్టు రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు; ఇది ముస్లింలు, క్రైస్తవులను కించపరచడంగానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది." అన్నారు.

కర్నాటకలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బికె హరిప్రసాద్ మాట్లాడుతూ.. "ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలలు పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నడుస్తున్నాయి. విద్యా మంత్రికి దానిని ఒక మతానికి పరిమితం చేయాల్సిన పని లేదు. అతను రాష్ట్రంలోని విద్యా రంగాన్ని వ‌ర్గీక‌రిస్తూ మ‌తీక‌ర‌ణ ( మ‌తాల‌కు ప‌రిమితం చేయ‌డం) చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోద‌యోగ్యం కాదు అన్నారు. కానీ వివేకానందుల వారు కాషాయ‌వ‌స్త్రాలు ధ‌రించారు కాబ‌ట్టి క్లాస్ రూమ్ ల‌కు రంగులు వేసిన త‌ర్వాత "వివేకా" అని పేరుపెడ‌తామంటూ విద్యా మంత్రి చేస్తున్న వాద‌న స‌ముచితం కాద‌ని కూడా అన్నారు. బిజెపి ప్రభుత్వ నిర్ణ‌యంతో వివేకానందుడి ఆత్మ ఘోషించ‌వ‌చ్చ‌ని రాజ‌మోహ‌న్ వ్యాఖ్యానించారు.

వివేకానంద 19వ శతాబ్దపు తన ఆధ్యాత్మిక వస్త్రాల రంగు కారణంగా 21వ శతాబ్దపు భారతదేశంలో మైనారిటీల పిల్లలను అధమ స్థానానికి నెట్టడాన్ని అనుమతించలేము. నిజానికి, భారతదేశంలోని పిల్లలలో ఒక వర్గాన్ని కించపరచడానికి స్వామి వివేకానందను ఉపయోగించుకునే ప్రయత్నాల‌తో ఆయ‌న ఆత్మ ఘోషిస్తుంది అని పేర్కొన్నారు.

జి-20 లో ప్ర‌సంగించిన‌ప్పుడు కూడా మోడీ భారతదేశాన్ని "బుద్ధుడు, గాంధీ న‌డ‌యాడిన భూమి"గా పేర్కొన్నాడు. ఇది అతను చాలాసార్లు ఉపయోగించిన పదబంధం. ఈశ్వర్ అల్లా తేరే నామ్ ను ప్ర‌స్తావించ‌కుండా , గుర్తించ‌కుండా ఎవరైనా గాంధీని గుర్తించుకోగ‌ల‌రా? మన జాతీయ గీతమైన జన గణ మన పూర్తి రూపంలో హిందూ, బౌద్ధో, శిఖో, జైనో, పరాశికో, ముషోల్మానో, క్రిస్టానీ వంటి భారతీయ కుటుంబ సభ్యులుగా ప్ర‌స్తావించార‌ని కొందరికి తెలియకపోవచ్చు, ఇది చరిత్ర.. సాహిత్యంలో మార్పులేని వాస్తవం. ఠాగూర్ రాసిన చరణాన్ని మన జాతీయగీతంగా ఎన్నుకున్నారు. మతం శత్రుత్వాన్ని బోధించదని సారే జహాన్ సే అచ్ఛాలో అల్లమా ఇక్బాల్ ఉద్ఘాటించ‌డం చరిత్రలో కాదనలేని వాస్తవమే గాక విస్తృతంగా తెలిసిన వాస్తవం. అని రాజ‌మోహ‌న్ గాంధీ పేర్కొన్నారు.

ఈ హానికరమైన ఆధిపత్య ధోరణులు కొంతకాలం విజయవంతం కావచ్చు. ప్రముఖులు కూడా దాని వెంట వెళ్ళవచ్చు. అయితే భారతదేశ ప్రజలు దీనిని ఎల్ల‌కాలం ని సహిస్తారా? భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ ధోర‌ణి ప‌ట్ల ఇప్ప‌టికే వ్యతిరేకత, ప్రతిఘటనలు పెరుగుతున్న సంకేతాలు క‌న‌బ‌డుతున్నాయంటున్నారు. అని రాజ‌మోహ‌న్ పేర్కొన్నారు.

First Published:  17 Nov 2022 5:47 PM IST
Next Story