Telugu Global
National

చిన్నారుల‌ మరణాలకు కారణమెవరు ? భారత్ ప్రపంచ ఫార్మసీ కేంద్రం అనే ప్రచారం లో నిజమెంత ?

భారత్ లో వివిధ కంపెనీలు తయారు చేస్తున్న మెడిసిన్ లో నాణ్యత ఉన్నదా ? ఆ మెడిసిన్ వల్ల వ్యతిరేక ప్రభావాలు వస్తున్నాయా ? అసలు ఆ మెడిసిన్ ఏ జబ్బుకోసమైతే తయారు చేశారో ఆ జబ్బును తగ్గిస్తోందా అని పరీక్షించే వ్యవ‌స్థ ఎలా పని చేస్తోంది ?

చిన్నారుల‌ మరణాలకు కారణమెవరు ? భారత్ ప్రపంచ ఫార్మసీ కేంద్రం అనే ప్రచారం లో నిజమెంత ?
X

భారత్ ప్రపంచ ఫార్మసీ కేంద్రం అని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. కొద్ది రోజుల క్రితం చెన్నైలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ప్రపంచానికి అవసరమైన మందుల్లో ఎక్కువ శాతం భారత్ నుండే ఎగుమతి అవుతున్నాయని ప్రకటించారు.

మన వైపు నుంచి జరిగే మంచి గురించి ప్రచారం చేసుకోవడంలో ఏ తప్పూ లేదు. దాంతో పాటు మనవైపు నుంచి జరిగే చెడును కూడా చెప్పుకోవాలి. భారత్ లో వివిధ కంపెనీలు తయారు చేస్తున్న మెడిసిన్ లో నాణ్యత ఉన్నదా ? ఆ మెడిసిన్ వల్ల వ్యతిరేక ప్రభావాలు వస్తున్నాయా ? అసలు ఆ మెడిసిన్ ఏ జబ్బుకోసమైతే తయారు చేశారో ఆ జబ్బును తగ్గిస్తోందా అని పరీక్షించే వ్యవ‌స్థ ఎలా పని చేస్తోంది ?

ఇప్పుడు ఉజ్బెకిస్థాన్, గాంబియా దేశాల్లో పిల్లల మరణాలు ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నవి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫార్మ‌సీ కంపెనీ మారియ‌న్ బ‌యోటెక్ సంస్థ త‌యారు చేస్తున్న డాక్‌-1 మ్యాక్స్ ద‌గ్గు సిరప్ తాగి తాజాగా ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతిచెందిన విష‌యం తెలిసిందే. దీనికి ముందు గాంబియా లో హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గుమందు తాగి 70 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు.

ఈ నేపథ్యంలో భారత్ ఫార్మసీ రంగంపై నీలినీడలు వ్యాపించాయి. భారత్ ప్రపంచ ఫార్మసీ కేంద్రం అంటూ బీజేపీ సర్కార్ చేస్తున్న ప్రచారంపై కూడా విమర్శలు మొదలయ్యాయి.

ఇప్పటికైనా ఇటువంటి లేని గొప్పలు చెప్పుకోవడం మానేయండి అంటూ బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ మండిపడింది.

''భారత్ లో తయారైన దగ్గు మందులు ప్రాణాంతకంగా అనిపిస్తున్నాయి. మొదట గాంబియాలో 70 మంది చిన్నారులు, ఇప్పుడు ఉజ్బెకిస్థాన్లో 18 మంది.. మోడీ సర్కారు భారత్ ను ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా గొప్పలు చెప్పుకోవడం మానేయాలి. కఠిన చర్యలు తీసుకోవాలి'' అని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.

ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాక అనేక వైపుల నుండి విమర్శలు వస్తున్నప్పటికీ బీజేపీ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. తనను తాను సమర్దించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది.

''గాంబియాలో చిన్నారుల మరణాలు భారత్ లో తయారు చేసిన దగ్గు మందు తాగడం వల్ల కాదు. ఇదే విషయాన్ని గాంబియన్ అధికారులు, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేశారు. కానీ మోడీ పట్ల విద్వేషంతో కాంగ్రెస్ భారత పారిశ్రామిక స్ఫూర్తిని దెబ్బ తీస్తోంది. సిగ్గు చేటు'' అని బీజేపీ మీడియా కార్యదర్శి అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.

మాలవీయ చెప్పిందే నిజమైతే గాంబియా లో పిల్లల మృతికి కారణమైందని ప్రచారం జరుగుతున్న దగ్గుమందు తయారు చేస్తున్న హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో ఔషధాల తయారీని నిలిపివేయాలని హర్యాణా ప్రభుత్వ ఎందుకు ఆదేశించినట్టు? ఇప్పుడు ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారుల మరణాల తర్వాత ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫార్మ‌సీ కంపెనీ మారియ‌న్ బ‌యోటెక్ కంపెనీ పట్ల కూడా యూపీ ప్రభుత్వం కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటోంది ?

ఈ రెండు కంపెనీల వ్యవహారం బైటపడింది కాబట్టి వాటిపై చర్చ జరుగుతోంది. ఇంకా ఇలాంటి కంపెనీలు భారత్ లో ఎన్ని ఉన్నాయి ? వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉందా ? ప్రపంచంలో చాలా గొప్పోళ్ళం అని చెప్పుకోవడం కోసం ప్రాణాలు పోయే పరిస్థితిని తీసుకవస్తారా ? ఈ ఏ నరకంలోకి ఈ ప్రస్థానం ?

First Published:  29 Dec 2022 1:26 PM IST
Next Story