ప్రధాని మోడీ చెప్పిన ఎరువుల 'ఆత్మనిర్భర్' లో నిజమెంత ?
మన దేశం, కెనడా, ఇజ్రాయిల్, బెలారస్, రష్యాల నుండి ఎరువులను కొనుగోలు చేస్తున్నది. ప్రతి ఏడాది ప్రభుత్వ లెక్కల ప్రకారమే 40 లక్షల టన్నుల నుండి 50 లక్షల టన్నుల పొటాష్ ను బెలారస్, రష్యా ల నుండి దిగుమతి చేసుకుంటుంది.
ప్రధాని మోడీ మొన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మళ్ళీ ప్రారంభించిన సందర్భంగా, దేశానికి కావాల్సిన ఎరువులన్నీ ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నామన్నారు. ''ఎరువుల కోసం గతంలో విదేశాలపై ఆధారపడేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.'ఆత్మనిర్భర్ భారత్'తోనే ఇది సాధ్యమైంది'' అని ఆ రోజు మోడీ చెప్పారు.
మరి మోడీ చెప్పిన మాటల్లో నిజముందా ? ఎరువులు మొత్తాన్ని మనమే తయారు చేసుకుంటున్నామా ? విదేశాలనుండి దిగుమతి చేసుకోవడం లేదా ?
ఈ మధ్య కేంద్రమంత్రి మన్‌సుఖ్‌మాండవీయా ప్రకటించిన ప్రకారం.. ఏడాదికి 25 లక్షల టన్నుల అమ్మోనియా, డీఏపీ, ఎన్‌పీకే ఎరువులను దిగుమతి చేసుకోవడానికి గత ఆగస్టులోనే సౌదీ అరేబియాతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొన్నది.
అంతే కాదు మన దేశం, కెనడా, ఇజ్రాయిల్, బెలారస్, రష్యాల నుండి కూడా ఎరువులను కొనుగోలు చేస్తున్నది.
ప్రతి ఏడాది ప్రభుత్వ లెక్కల ప్రకారమే 40 లక్షల టన్నుల నుండి 50 లక్షల టన్నుల పొటాష్ ను బెలారస్, రష్యా ల నుండి దిగుమతి చేసుకుంటుంది.
ఈ సారి ఉక్రెయిన్ , రష్యా యుద్దం వల్ల షిప్పింగ్ మార్గాలు మూసివేయబడ్డాయి. మాస్కోపై పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా, బెలారస్ కంపెనీలనుండి దిగుమతులు చేసుకోవడం మన దేశానికి కష్టతరం అయ్యింది. దాంతో ఈ సారి ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (IPL) కెనడా, ఇజ్రాయెల్, జోర్డాన్ ల నుండి పొటాష్ దిగుమతులను పెంచింది.
2022లో భారత్, కెనడా నుండి 12 లక్షల టన్నుల పొటాష్, ఇజ్రాయెల్ నుండి 6 లక్షల టన్నులు, జోర్డాన్ నుండి 3లక్షల టన్నులు కొనుగోలు చేసింది.
ఒకటి కంటే ఎక్కువ పంటల పోషకాలను అందించే సంక్లిష్ట ఎరువుల కోసం భారతదేశం ఇప్పటికీ రష్యా , బెలారస్‌లపైనే ఎక్కువగా ఆధారపడుతుంది.
నత్రజని, ఫాస్ఫేట్, పొటాష్ లలో ఇతర దేశాలనుండి దిగుమతులు తగ్గితే భారతీయ కంపెనీలు సౌదీ అరేబియా, మొరాకో ల నుండి కూడా దిగుమతి చేసుకుంటున్నాయి.
ఇది మన దేశపు ఎరువుల రంగం అసలు స్థితి. ఇది పూర్తిగా మోడీ మాట్లాడిన మాటలకు విరుద్దమైన పరిస్థితులను తెలియజేస్తున్నది. 'ఆత్మనిర్భర భారత్' లోని డొల్ల తనాన్ని వెల్లడిస్తున్నది.
మరి ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి? యూపీఏ, వాజ్ పేయి సర్కార్ లు పాలిస్తున్న సమయంలో నష్టాలు కారణంగా చూపి దేశంలోని 11 ప్రభుత్వరంగ ఎరువుల కర్మాగారాలను మూసేశారు. ఆ కంపెనీలన్నింటినీ తిరిగి తెరిపిస్తామని 2014 ఎన్నికల ప్రచారంలో మోడీ హామీ ఇచ్చారు. కానీ 2014 లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా మూడు ఫ్యాక్టరీలను మాత్రమే తిరిగి ప్రారంభించారు. పైగా అనేక ప్రైవేటు కంపెనీలకు అనుమతులు ఇచ్చారు.
తిరిగి తెరిచిన వాటిలో ఒకటైన ఉత్తరప్రదేశ్ లోని హెచ్‌యూఆర్‌ఎల్-గోరఖ్‌పూర్ కర్మాగారం నెలలో 15 రోజులు మూతబడే ఉంటున్నది. విద్యుత్తు, నీటి సరఫరా సరిగా లేకపోవడమే ఫ్యాక్టరీ సరిగా నడవక పోవడానికి కారణమని కార్మిక సంఘాలుల ఆరోపిస్తున్నాయి. ఇక జార్ఖండ్‌లోని హెచ్‌యూఆర్‌ఎల్-సింద్రీ కార్మాగారం ప్రారంభించి 3 రోజులే అయ్యింది.
ఇక తెలంగాణలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషే ఆ మాత్రమైనా ఆ ఫ్యాక్టరీ నడవడానికి కారణం. ఆ కంపెనీలో 11 శాతం వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం 160 కోట్ల రూపాయలు చెల్లించింది. 2015 నుంచి ఇప్పటి వరకు ఫ్యాక్టరీ పునరుద్దరణ పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 80 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పైపులైను వేయించి శుద్ధమైన నీటిని సరఫరా చేస్తున్నది.14 కోట్ల రూపాయలతో విద్యుత్తు లైన్లు, రహదారులు నిర్మించింది. తెలంగాణ ప్రభుత్వ చొరవ లేకపోతే రామంగుండం ఎరువుల కార్మాగారం ప్రారంభం కానీ నిర్వహణ గానీ జరగకపోయేది అనేది వాస్తవం.
మళ్ళీ మొన్న ప్రధాని మోడీ చెప్పిన మాటలను మరో సారి గుర్తు చేసుకుందాం ''ఎరువుల కోసం గతంలో విదేశాలపై ఆధారపడేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.'ఆత్మనిర్భర్ భారత్'తోనే ఇది సాధ్యమైంది''
ఇప్పుడు మీరు ఆలోచించండి. నిజమేంటో, అబద్దమేంటో...నీళ్ళకు నీళ్ళు, పాలకు పాలు వేరు చేయగల సత్తా మీలో ఉంది.