Telugu Global
National

అదానీతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్నేహం దేనికి సంకేతం ?

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ , పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీని పొగడ్తలతో ముంచెత్తడం దేనికి సంకేతం అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. ఒక వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అదానీపై విరుచుకపడుతూ ఉంటే గెహ్లెట్ అదానీతో స్నేహం చేయడంపై బీజేపీ హేళన చేసింది.

అదానీతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్నేహం దేనికి సంకేతం ?
X

నిత్య‌మూ కాంగ్రెస్ పార్టీ నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్త గౌత‌మ్ అదానీని రాజ‌స్థాన ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. పెట్టుబ‌డుల స‌ద‌స్సు (ఇన్వెస్ట్ రాజ‌స్థాన్‌) సంద‌ర్భంగా వారిద్ద‌రూ వేదిక పంచుకోవ‌డ‌మేగాక ప‌క్క‌ప‌క్క‌నే కూర్చుని ముచ్చ‌టించ‌డం ప‌లువురు ఆస‌క్తిగా గ‌మ‌నించారు. అంతేగాక ఆయ‌న మాట్లాడుతూ అదానీని గౌత‌మ్ భాయ్ అంటూ ఎంతో ఆద‌రంగా స్నేహ‌ బంధాన్ని వ్య‌క్తం చేశారు. పెట్టుబ‌డుల స‌ద‌స్సులు జ‌రిగిన‌ప్పుడు పారిశ్రామిక వేత్త‌ల‌ను ఆయా రాష్ట్రాల ముఖ్యులు పొగ‌డ‌డం స‌హ‌జ‌మే. కానీ రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థ‌తులలో ఆదానీని గెహ్లాట్ సోద‌రుడ‌ని సంభోదించ‌డంపై ప‌లు ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఈ సంద‌ర్భాన్ని బిజెపి అనువుగా తీసుకుని కాంగ్రెస్ ను హేళ‌న చేస్తోంది. గెహ్లాట్ వ్య‌వ‌హ‌రించిన తీరు అధిష్టానానికి చెంప‌దెబ్బ అని వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ త‌ర‌చూ ఆయ‌న ప్ర‌సంగాల‌లో ప్ర‌ధాన మోడీ ఇద్ద‌రు పారిశ్రామిక వేత్త‌ల‌కే స‌హాయం చేస్తుంటారంటూ విమ‌ర్శిస్తుంటారు.

కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా... పార్లమెంటులో రాహుల్ గాంధీ అదానీ ,ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై దాడి చేసిన 47 సెకన్ల క్లిప్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. కేంద్రం అదానీ, అంబానీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపిస్తుంటే, రాజస్థాన్ ముఖ్యమంత్రి ఇద్దరు వ్యాపార దిగ్గజాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పూనియా అన్నారు. నిన్నటి దాకా విమ‌ర్శించిన వాడు నేడు స‌న్నిహితుడ‌య్యాడు. పెట్టుబ‌డులు పై ఆశలు పెట్టుకుని, తమ పంథాను మార్చుకున్నారు అని ఎద్దేవా చేశారు.

బిజెపి ఎమ్మెల్యే ,మాజీ మంత్రి వాసుదేవ్ దేవ్‌నానీ శిఖరాగ్ర సమావేశంలో అదానీతో కలిసి కూర్చున్న గెహ్లాట్ చిత్రాన్ని షేర్ చేశారు. ఇది కాంగ్రెస్ హైకమాండ్ ముఖంపై గట్టి చెంపదెబ్బ అని అన్నారు. మ‌రో ట్వీట్ లో ఆదానీనీ ముఖ్య‌మంత్రి పొగుడుతున్న వీడియోను షేర్ చేశారు.

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాజ‌స్థాన్ లో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విష‌య‌మై గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పారు. త‌నకు విధేయులైన పలువురు ఎమ్మెల్యేలు తనను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో శాసనసభ పక్ష సమావేశాన్ని వారు బహిష్కరించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా భాయ్ అంటూ గెహ్లాట్ బంధాన్ని ఏర్పర్చుకుంటూ మాట్లాడ‌డం పై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్ లోఉంటూనే ఆయ‌న అనుచ‌రులు గెహ్లాట్ ను ముఖ్య‌మంత్రిని చేయ‌క‌పోతే రాజీనామాలు చేయ‌డం వంటి సంఘ‌ట‌న‌ల నేపథ్యంలో రానున్న రోజుల‌లో రాష్ట్రంలో ప‌రిణామాలు ఎలా ఉంటాయోన‌ని చ‌ర్చించుకుంటున్నారు.

సమ్మిట్ సందర్భంగా అదానీ, గెహ్లాట్ సామాజిక భద్రతా పథకాలు, అతని దార్శనికతను మెచ్చుకున్నారు. కాగా, రాబోయే ఐదు నుండి ఏడేళ్లలో రాష్ట్రంలో రూ. 65,000 కోట్ల పెట్టుబడులను అదానీ ప్ర‌క‌టించారు. 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, సిమెంట్ ప్లాంట్‌ను విస్తరించడం, జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అప్‌గ్రేడ్ చేయడం వంటి ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. వైద్య సౌక‌ర్యాలు లేని చోట‌ రెండు మెడిక‌ల్ కాలేజీల‌ను కూడా స్థాపిస్తామ‌ని, ఉద‌య్ పూర్ లో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామ‌ని హ‌మీ ఇచ్చారు.

First Published:  8 Oct 2022 7:21 AM GMT
Next Story