Telugu Global
National

చైనాతో మోడి సర్కార్ కు ఉన్న రహస్యబంధ‌మేంటి ? -ప్రశ్నించిన కాంగ్రెస్

చైనా సమస్య పట్ల ప్రతిపక్షాలు, మీడియా కళ్లు మూసుకొని ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ నుంచి ప్రభుత్వం పారిపోతోంది. ఒక వేళ చర్చ జరిగితే ప్రధాని చైనాను ఏమీ అనరు, పైగా చైనాకు క్లీన్ చిట్ ఇస్తారు అని కాంగ్రెస్ నాయకుడు ఖేరా ఆరోపించారు

చైనాతో మోడి సర్కార్ కు ఉన్న రహస్యబంధ‌మేంటి ? -ప్రశ్నించిన కాంగ్రెస్
X

పార్లమెంటులో భారత్-చైనా సరిహద్దు వివాదంపై చర్చ జరగకుండా కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటోందని, ఈ సమస్య నుంచి మోడీ ప్రభుత్వం ఎందుకు పారిపోతోందని కాంగ్రెస్ గురువారం ప్రశ్నించింది.

ప్రధాని నరేంద్ర మోడీ చైనాపై మౌనంగా ఉన్నారని, ఎప్పుడు మాట్లాడినా ఆ దేశానికి క్లీన్ చిట్ ఇస్తున్నారని ఏఐసీసీ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా మండిపడ్డారు.

మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రభుత్వ పాఠశాలల్లో మాండరిన్ (చైనా భాష‌)భాష‌ను ప్రవేశపెట్టాలని చాలా ఆసక్తిగా ఉండేవారని, ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని దౌసాలో ఉదయం 'భారత్ జోడో యాత్ర' విరామ సమయంలో విలేకరుల సమావేశంలో ఖేరా అన్నారు.

బీజేపీ ఓ చైనా కంపెనీని ఎన్నికల్లో ఉపయోగించుకుందని ఆరోపించిన ఖేరా ఇది భారత సార్వభౌమత్వానికి ముప్పు అని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నదని కూడా ఆయన తెలిపారు.

ప్రపంచ బ్యాంకు, అమెరికా, యూరప్ దేశాలు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఓ చైనా కంపెనీకి జమ్మూ కాశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలో స్మార్ట్ మీటర్లను అమర్చడానికి కాంట్రాక్ట్ ఇచ్చార‌ని ఆయన అన్నారు.

"చైనా సమస్య పట్ల ప్రతిపక్షాలు, మీడియా కళ్లు మూసుకొని ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ నుంచి ప్రభుత్వం పారిపోతోంది. ఒక వేళ చర్చ జరిగితే ప్రధాని చైనాను ఏమీ అనరు, పైగా చైనాకు క్లీన్ చిట్ ఇస్తారు" ఖేరా అన్నారు.

"మన సైనికులు ధైర్యవంతులు. వారు చైనా సైనికులను ఎదిరించి వెనక్కి నెట్టారు. మన‌ సైన్యం గురించి మేము గర్విస్తున్నాము. కానీ ప్రధానమంత్రి చైనాకు క్లీన్ చిట్ ఇస్తే, మా సరిహద్దులు ఎలా సురక్షితంగా ఉంటాయి?'' అని ఖేరా అడిగారు.

"మీకు చైనాతో ఉన్న సంబంధం ఏమిటి? చైనాకు వ్యతిరేకంగా మాట్లాడటానికి, చర్యలు తీసుకోవడానికి మిమ్మల్ని ఆపుతున్న‌ శక్తి ఏంటి ? మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. దేశం మొత్తం తెలుసుకోవాలనుకుంటోంది. " అని ఖేరా అన్నారు.

గుజరాత్‌లోని దోలేరాలో చైనా కంపెనీలకు ప్రభుత్వం భూమిని కేటాయించిందని ఖేరా పేర్కొన్నారు.

పీఎం కేర్స్ ఫండ్‌కు చైనా కంపెనీలు డబ్బును విరాళంగా ఇచ్చాయని, ఈ చర్య వెనుక వారి ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఖేరా డిమాండ్ చేశారు.

"సైనిక నిపుణులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు పేర్లు మార్చింది. అక్కడ ఒక గ్రామాన్నే ఏర్పాటు చేశారు. అయినా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ప్రభుత్వం మౌనం వహించడం వెనుక కారణం ఏమిటి? అని పవన్ ఖేరా ప్రశ్నించారు.

చైనా అంశంపై చర్చకు సంబంధించి పార్లమెంటులో కొనసాగుతున్న గొడవపై ఖేరా మాట్లాడుతూ, 1962 భారత్-చైనా యుద్ధ సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి పార్లమెంటులో చర్చకు డిమాండ్ చేశారని, నెహ్రూ దానిని అంగీకరించారని చెప్పారు.

"ఇది రహస్య చర్చ అని మీడియాలో రాకుండా చూసుకోవాలని ఒక ఎంపీ సూచించారు, కానీ అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆ ఎంపీ సూచనను తిరస్కరించారు," అని ఖేరా అన్నారు, ప్రధాని నరేంద్ర మోడీ చరిత్ర నుండి నేర్చుకోవాలని ఆయన అన్నారు. ఆ రోజు అధికార పక్ష ఎంపీలు కూడా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.'' అని ఖేరా తెలిపారు.

First Published:  15 Dec 2022 3:30 PM IST
Next Story