Telugu Global
National

ఓటు వేయకపోతే జరిగే నష్టాలివే..

మనదేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సుమారు 60 శాతం పోలింగ్ మాత్రమే నమోదవుతుంది. అంటే వందలో అరవై మంది మాత్రమే ఓటు వేస్తున్నారు.

ఓటు వేయకపోతే జరిగే నష్టాలివే..
X

మనదేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సుమారు 60 శాతం పోలింగ్ మాత్రమే నమోదవుతుంది. అంటే వందలో అరవై మంది మాత్రమే ఓటు వేస్తున్నారు. మిగతా నలభై మంది అభిప్రాయం ఏంటనేది తెలియకుండానే పోతుంది. దీనివల్ల ప్రజాస్వామ్యానికి నష్టం చేసినవాళ్లవుతారు. అసలు ఓటు ఎందుకు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మనదేశంలో రకరకాల మతాలు, భాషలు, సాంప్రదాయాల వాళ్లు ఉంటారు. ఇంత వైవిధ్యం ఉన్న మనదేశంలో ప్రజలు కోరుకున్న వాళ్లే పరిపాలన సాగించే విధంగా మన రాజ్యాంగం రూపొందించబడింది. దీన్నే మనం ప్రజాస్వామ్యం అంటున్నాం. మరి ఈ ప్రజాస్వామ్యం నిలబడాలంటే దానికి పూనుకోవాల్సిందే ప్రజలే. దానికోసం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. ఐదేళ్లకోసారి పోలింగ్ బూత్‌కు వెళ్లి తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేడమే.

ఈ మాత్రం కూడా చేయకపోతే ప్రజాస్వామ్యం నిలబడడం కష్టం. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని తప్పక వినియోగించుకోవాలి. ‘పాలిటిక్స్ పాడైపోయాయి’, ‘వీటిని మనం బాగు చేయలేం’ అని కొంతమంది భావిస్తుంటారు. అయితే కేవలం ఓటు వేయడం ఒక్కటే వాటిని బాగు చేసే మార్గం అని తెలుసుకోవాలి.

మీకు సేవలందించేందుకు అన్నివిధాలా అర్హులైన వ్యక్తులను ఎంచుకోవడానికి ఇదే అనువైన సమయం. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఎలాంటి ప్రలోభాలకు ప్రభావితం కాకుండా సొంతంగా ఆలోచించి ఓటు వేయాలి. ఎవరికి వాళ్లు తమ సొంత ఆలోచనతో ఓటు వేయడం ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేసినట్టు అవుతుంది. మీకు ఫలానా వాళ్ల పాలసీ నచ్చిందనో లేదా అసలు ఎవరూ సరైన వాళ్లు కాదనో తెలియజేసేందుకు ఓటు ఒక్కటే మార్గం. ఒకవేళ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులెవరూ మీకు నచ్చకపోతే ‘నన్ ఆఫ్ ది అబౌవ్(నోటా)’ ను ఎంచుకోవచ్చు. ‘నువ్వు ఓటు వేస్తే ఇంకొకరు గెలవడం కాదు, నువ్వు గెలవడం కోసం ఓటు వేయాలి’ అనేది నిపుణులు చెప్పేమాట. ఓటుకు ఉన్న శక్తి అదే.

First Published:  29 Nov 2023 3:30 PM IST
Next Story