Telugu Global
National

సీబీఐపై మర్డర్ కేసు నమోదు చేసిన బెంగాల్ పోలీసులు

సీబీఐ అధికారులు చెబుతున్నది అవాస్తవమని లాలన్ షేక్ భార్య రేష్మా బీబీ ఆరోపించారు. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు బొగోటి గ్రామానికి వచ్చినప్పుడు తన భర్తను చంపేస్తామని బెదిరించారని రేష్మా బీబీ మంగళవారం రాంపూర్ హట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

సీబీఐపై మర్డర్ కేసు నమోదు చేసిన బెంగాల్ పోలీసులు
X

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఏమాత్రం అవకాశం దొరికినా ఈ రెండు పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునేందుకు ముందుంటాయి. తాజాగా కేంద్ర దర్యాప్తు బృందం అయిన సీబీఐపై పశ్చిమ బెంగాల్ పోలీసులు హత్య కేసు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది.

ఈ ఏడాది మార్చిలో బెంగాల్ రాష్ట్రం బీర్భూమ్ లో చెలరేగిన అల్లర్లలో పదిమంది సజీవ దహనం అయ్యారు. బీర్భూమ్ లో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బదుషేక్ హత్య తర్వాత ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఈ హింసాకాండలో బొగోటి గ్రామంలో పదిమంది సజీవ దహనం అయ్యారు. ఈ కేసు విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.

బొగోటి గ్రామంలో పదిమంది సజీవ దహనం కావడంలో అదే గ్రామానికి చెందిన లాలన్ షేక్ ప్రధాన నిందితుడిగా సీబీఐ అధికారులు గుర్తించారు. అతడిని సీబీఐ అధికారులు ఎనిమిది నెలల కిందట అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా బీర్భూమ్ హింసకాండలో ప్రధాన నిందితుడిగా ఉన్న లాలన్ షేక్ సోమవారం సీబీఐ క్యాంప్ కార్యాలయంలోని వాష్ రూమ్ లో శవమై కనిపించాడు. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

అయితే సీబీఐ అధికారులు చెబుతున్నది అవాస్తవమని లాలన్ షేక్ భార్య రేష్మా బీబీ ఆరోపించారు. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు బొగోటి గ్రామానికి వచ్చినప్పుడు తన భర్తను చంపేస్తామని బెదిరించారని రేష్మా బీబీ మంగళవారం రాంపూర్ హట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్త మరణానికి సీబీఐ అధికారులే కారణమని రేష్మా చేసిన ఫిర్యాదు మేరకు బెంగాల్ రాష్ట్ర పోలీసులు సీబీఐ అధికారులపై హత్య నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీబీఐ అధికారులపై బెంగాల్ పోలీసులు మర్డర్ కేసు నమోదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

First Published:  14 Dec 2022 2:19 PM IST
Next Story