సీఎం మమతా బెనర్జీకి తీవ్ర గాయం
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు పోస్ట్ చేసిన ఫొటోలో మమతా బెనర్జీకి నుదుటిపై గాయం స్పష్టంగా కనిపిస్తోంది. దాని నుంచి రక్తం కారుతున్న దృశ్యం కూడా కనిపిస్తోంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి నుదుటిపై తీవ్ర గాయమైంది. ఇంట్లో కాలు జారి పడిపోవడంతో ఈ గాయమైనట్టు తెలుస్తోంది. మమతకు గాయమైన విషయాన్ని ఆ పార్టీ వర్గాలు గురువారం సాయంత్రం వెల్లడించాయి. గాయంతో కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో మమతా బెనర్జీ చికిత్స పొందుతున్న ఫొటోలను ఆ పార్టీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. దీదీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు పోస్ట్ చేసిన ఫొటోలో మమతా బెనర్జీకి నుదుటిపై గాయం స్పష్టంగా కనిపిస్తోంది. దాని నుంచి రక్తం కారుతున్న దృశ్యం కూడా కనిపిస్తోంది. మమతా బెనర్జీ ఆస్పత్రిలో గాయంతో చికిత్స పొందుతున్న సమాచారం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా సీఎం మమతా బెనర్జీ కోలుకోవాలంటూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరిలోనూ మమతా బెనర్జీకి ఓ ప్రమాదంలో స్వల్ప గాయమైంది. కారులో వెళుతుండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ ఘటన జరిగింది. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వెళ్తుండగా, మమత కాన్వాయ్‌కి ఎదురుగా ఉన్నట్టుండి మరో వాహనం వచ్చింది. దీంతో కారు డ్రైవర్ వెంటనే దానిని తప్పించేందుకు కారుకు బ్రేకులు వేశాడు. హఠాత్తుగా జరిగిన ఊహించని ఘటనతో ముందు సీట్లో కూర్చున్న సీఎం మమత.. విండో షీల్డుకు గుద్దుకున్నారు. ఆ ఘటనలో ఆమె తలకు స్పల్ప గాయమైనట్టు అధికారులు వెల్లడించారు.