భారత్‌లో అధ్యక్ష తరహా పాలన..!
ప్రజలు న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని తాను అనడం లేదని, అయితే ప్రస్తుతం పరిస్థితి మరింత దిగజారిందని మాత్రం కచ్చితంగా చెప్పగలనని అన్నారు మమతా బెనర్జీ.
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈ పరిస్థితులు దేశంలో అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తున్నాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని ఆమె సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యుయు లలిత్‌ని కోరారు. కోల్‌కతాలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ (NUJS) స్నాతకోత్సవంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి సీజేఐ లలిత్, మమతా బెనర్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
న్యాయ వ్యవస్థ పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు..
ప్రజలు న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని తాను అనడం లేదని, అయితే ప్రస్తుతం పరిస్థితి మరింత దిగజారిందని మాత్రం కచ్చితంగా చెప్పగలనని అన్నారు మమతా బెనర్జీ. ప్రజలకు అన్యాయం జరగకుండా రక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందని, ప్రజలు బాధపడుతున్నారని, వారి మొర న్యాయ వ్యవస్థ వినాలని చెప్పారు మమతా బెనర్జీ. న్యాయస్థానాల్లో తీర్పు రాకముందే చాలా విషయాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇలా చెబుతున్నందుకు తనను క్షమించాలని అంటూనే సీజేఐ ముందు న్యాయ వ్యవస్థ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు మమతా బెనర్జీ. బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే న్యాయ వ్యవస్థ సత్తా ఏంటో లలిత్ నిరూపించారని ఆమె అభినందించారు.
ప్రజలను రక్షించాల్సింది మీరే..
ప్రజలను వేధింపుల నుంచి రక్షించాలని, NUJS విద్యార్థులపై ఆ బాధ్యత ఉందని చెప్పారు మమతా బెనర్జీ. సమాజంలో ఓ నిర్దిష్ట వర్గం ప్రజాస్వామ్య అధికారాన్ని స్వాధీనం చేసుకుంటోందని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నారు. మీడియాకి కూడా స్వేచ్ఛ లేదని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీడియా ఎవరినీ విమర్శించలేకపోతోందని చెప్పారు. చీఫ్ జస్టిస్‌ని ముందు పెట్టుకునే ఆమె న్యాయ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు, అదే సమయంలో ప్రజా స్వామ్యాన్ని, ప్రజలను రక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపైనే ఉందని అన్నారు.