Telugu Global
National

రెజ్లర్ల కన్నీటిని దేశం గమనిస్తోంది.. దేశం బీజేపీని క్షమించదు.. మమత మండిపాటు

రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసుల అనుచిత తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో స్పందించారు. మన ఆడబిడ్డల గౌరవ మర్యాదలను ఈ విధంగా మంట కలపడం సిగ్గుచేటు అని అన్నారు.

రెజ్లర్ల కన్నీటిని దేశం గమనిస్తోంది.. దేశం బీజేపీని క్షమించదు.. మమత మండిపాటు
X

దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం చేపట్టిన రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. దేశంలోని అన్ని పార్టీల నాయకులు రెజ్లర్లకు అండగా నిలుస్తున్నారు. పోలీసుల ప్రవర్తన పట్ల విమర్శలు చేస్తున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే నిన్న అర్ధరాత్రి ధర్నా చేస్తున్న రెజ్లర్ల వద్దకు ఢిల్లీ పోలీసులు వచ్చారు. ఎన్నోసార్లు ఛాంపియన్లుగా నిలిచిన రెజ్లర్లు అని కూడా చూడకుండా వారిపై దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రెజ్లర్ల పట్ల పోలీసుల అనుచిత తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో స్పందించారు. మన ఆడబిడ్డల గౌరవ మర్యాదలను ఈ విధంగా మంట కలపడం సిగ్గుచేటు అని అన్నారు. దేశం బీజేపీని క్షమించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మమత పోస్ట్ చేశారు.

'భారతదేశం తన ఆడబిడ్డలకు అండగా నిలుస్తుంది. మనిషిగా నేను రెజ్లర్లకు మద్దతుగా నిలుస్తున్నా. న్యాయం అందరికీ ఒకటే. పాలకుడి చట్టం ఛాంపియన్లుగా నిలిచిన వారి గౌరవ మర్యాదలను హైజాక్ చేయకూడదు. రెజ్లర్లపై భౌతికంగా దాడి చేయగలరేమో.. కానీ వారి స్ఫూర్తిని మాత్రం దెబ్బ తీయలేరు. రెజ్లర్ల పోరాటం సరైనదే. వారి పోరాటం కొనసాగుతుంది. రెజ్లర్లను గాయపరిచే ప్రయత్నం మరోసారి చేయవద్దు. రెజ్లర్ల కన్నీటిని దేశం గమనిస్తోంది. దేశం బీజేపీని క్షమించదు. కష్టకాలంలో రెజ్లర్లు దృఢంగా ఆత్మస్థైర్యంతో వ్యవహరించాలి.' అని మమత ట్వీట్ చేశారు.

రెజ్లర్ల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. క్రీడాకారుల పట్ల ఇటువంటి ప్రవర్తన సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆడపిల్లలను కాపాడండి.. అని బీజేపీ ఇస్తున్న నినాదం నయవంచన అని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ మొత్తం వ్యవస్థను గుండాయిజంతో నడుపుతోందని, బీజేపీని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  4 May 2023 5:02 PM IST
Next Story