వెల్కమ్ టు సీబీఐ.. ఢిల్లీ సీఎం వెటకారం..
ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ ను ప్రశంసిస్తూ అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్‌లో ఈరోజు ఫ్రంట్ పేజీలో కథనం వచ్చిందని, ఇదేరోజు మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు చేయడం శోచనీయమన్నారు కేజ్రీవాల్.
ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ఆర్జేడీతో కలసి బీహార్‌లో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వేళ.. సీబీఐ, ఈడీ.. ఆ రాష్ట్రంపై ఫోకస్ పెడతాయంటూ జోకులు పేలాయి. అవసరమైతే సీబీఐ తమ ఇంట్లోనే బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసుకోవచ్చని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా వెటకారం చేశారు. కానీ, సీబీఐ కన్ను ఇప్పుడు ఢిల్లీపై పడినట్టుంది. ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణ చేపట్టింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అధికారిక నివాసం సహా మొత్తం 21 ప్రాంతాల్లో సీబీఐ దాడులు చేసింది, సోదాలు కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని మనీష్ సిసోడియా ధృవీకరించారు. సీబీఐకి స్వాగతం పలుకుతున్నామని, వారికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.
जिस दिन अमेरिका के सबसे बड़े अख़बार NYT के फ़्रंट पेज पर दिल्ली शिक्षा मॉडल की तारीफ़ और मनीष सिसोदिया की तस्वीर छपी, उसी दिन मनीष के घर केंद्र ने CBI भेजी
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 19, 2022
CBI का स्वागत है। पूरा cooperate करेंगे। पहले भी कई जाँच/रेड हुईं। कुछ नहीं निकला। अब भी कुछ नहीं निकलेगा https://t.co/oQXitimbYZ
ఢిల్లీలోని పాఠశాలల అభివృద్ధి కోసం మనీష్ సిసోడియా ఎంతో కృషి చేశారని చెబుతున్న కేజ్రీవాల్.. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ ను ప్రశంసిస్తూ అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్‌లో ఈరోజు ఫ్రంట్ పేజీలో కథనం వచ్చిందని, ఇదేరోజు మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు చేయడం శోచనీయమన్నారు కేజ్రీవాల్. గతంలో తమపై ఎన్నోసార్లు సోదాలు జరిగాయని, కానీ ఏమీ తేల్చలేకపోయారని చెప్పారు.
అసలు కేసేంటి..?
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం గతేడాది నవంబర్ లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. అయితే ఈ పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలున్నాయి. ఈ పాలసీ అమలు నేపథ్యంలో ఇటీవలే 11మంది అధికారులపై ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా సస్పెన్షన్ వేటు వేశారు. ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణపై కూడా వేటు పడింది. అక్కడితో ప్రభుత్వానికి, గవర్నర్ కి మధ్య మరోసారి గొడవలు మొదలయ్యాయి. కొత్త ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది కూడా. అయితే పాలసీ తీసుకొచ్చిన సమయంలో ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్న అరవ గోపీకృష్ణ నివాసంలో కూడా ఈరోజు సీబీఐ సోదాలు చేపట్టింది. మనీష్ సిసోడియా అధికారిక నివాసంలో కూడా అధికారులు సోదాలు చేపట్టారు. కేంద్రం రాజకీయ కక్షతో ఈ పని చేసిందంటూ విమర్శలు మొదలయ్యాయి.