Telugu Global
National

మాస్కులు ధరించండి... దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సూచన‌

రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు తప్పకుండా మాస్క్ లు ధరించాలని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి కె పాల్ బుధవారం నాడు సూచించారు. అలాగే ప్రజలందరూ మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారాయన.

మాస్కులు ధరించండి... దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సూచన‌
X

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా పాజిటీవ్ కేసులు ఊహించనంతగా పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశ‌ ప్రజలకు పలు సూచనలు చేసింది.

రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు తప్పకుండా మాస్క్ లు ధరించాలని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి కె పాల్ బుధవారం నాడు సూచించారు. అలాగే ప్రజలందరూ మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారాయన.

అయితే ప్రజలెవ్వరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించిన మార్గదర్శకాల్లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు వి కె పాల్.

"ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలి. ఇతర వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు ముఖ్యంగా దీనిని పాటించాలి" అని పాల్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య‌ నిర్వహించిన సమీక్షా సమావేశం తరువాత పాల్ ఈ ప్రకటనలు చేశారు.

"కొన్ని దేశాల్లో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా, నేను ఈరోజు నిపుణులతో, అధికారులతో పరిస్థితిని సమీక్షించాను. కోవిడ్ ఇంకా ముగియలేదు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, నిఘాను పటిష్టం చేయాలని సంబంధిత వ్యక్తులందరికీ సూచించాను. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ," అని మాండవ్య ట్వీట్‌లో పేర్కొన్నారు.

First Published:  21 Dec 2022 11:31 AM GMT
Next Story