Telugu Global
National

400 సీట్లు గెలుస్తాం.. చివరి స్పీచ్‌లో మోడీ సంచలన వ్యాఖ్య‌లు

వచ్చే టర్మ్‌లోనే ఇండియాను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇది తన పదేళ్ల పాలన అనుభవంతో చెప్తున్నానన్నారు మోడీ.

400 సీట్లు గెలుస్తాం.. చివరి స్పీచ్‌లో మోడీ సంచలన వ్యాఖ్య‌లు
X

సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్లమెంట్‌లో చివరి ప్రసంగం చేశారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియాను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుపుతామన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం.. ఇండియా ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్నందుకు గర్విస్తున్నామని చెప్పారన్నారు. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు మోడీ. ఇండియాను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు కాంగ్రెస్‌ 30 ఏళ్లు టార్గెట్‌ పెట్టుకుందని, కానీ బీజేపీ అంత సమయం వేచి చూడదన్నారు.

వచ్చే టర్మ్‌లోనే ఇండియాను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇది తన పదేళ్ల పాలన అనుభవంతో చెప్తున్నానన్నారు మోడీ. 2014 నుంచి తమ ప్రభుత్వం సాధించిన విజయాలను లోక్‌సభలో వివరించారు. పేదల కోసం 4 కోట్ల పక్కా గృహాలు నిర్మించామని చెప్పారు. కాంగ్రెస్‌ తరహాలో ఇళ్లు నిర్మించి ఉంటే వందేళ్లు పట్టేదన్నారు.

ఇక రాముడు అయోధ్యకు మాత్రమే కాదు.. గొప్ప ఆలయానికి తిరిగొచ్చాడన్నారు మోడీ. దీంతో ఈ సారి ఎన్డీఏ 400 స్థానాలకుపైగా గెలవడం ఖాయమన్నారు. బీజేపీ సొంతంగానే 370కి పైగా స్థానాలు గెలుచుకుంటుందన్నారు. మూడో విడతలో మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటామన్నారు మోడీ. తమ పాలన వెయ్యేళ్లు గుర్తుండిపోతుందన్నారు. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలోనే కూర్చోవాలని నిర్ణయించుకుందని.. అది వారి ప్రసంగాలను చూస్తే అర్థమైపోతుందన్నారు మోడీ.

First Published:  5 Feb 2024 3:33 PM GMT
Next Story