మోడీ 28 పైసల ప్రధాని - ఉదయనిధి సెటైర్లు
సేలం పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా రామనాథపురం, తేనిలలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న ఉదయనిధి ప్రధాని వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు.
నరేంద్ర మోడీ 28 పైసల ప్రధాని అని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేశారు. తమిళనాడులో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో ఒక పార్టీపై మరొక పార్టీ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా డీఎంకే, బీజేపీ మధ్య విమర్శల వార్ సాగుతోంది.
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఉదయనిధి వర్సెస్ మోడీ అన్నట్లుగా వ్యవహారం మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల తమిళనాడు రాష్ట్రం సేలం పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా రామనాథపురం, తేనిలలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న ఉదయనిధి ప్రధాని వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు.
మోడీ 28 పైసల ప్రధాని అని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర పన్నుల వాటాలో తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్లే ప్రతి రూపాయిలో తిరిగి 28 పైసలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని, అందువల్లే మోడీ 28 పైసల ప్రధాని అని ఉదయనిధి విమర్శించారు.
ఎన్నికల సమయంలో మాత్రమే ప్రధాని మోడీ తమిళనాడుకు వస్తుంటారని, ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడరని మండిపడ్డారు. మధురైలో ఎయిమ్స్ నిర్మాణం చేపడుతున్నట్లు ప్రధాని చెప్పినప్పటికీ అక్కడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి ఉందని విమర్శించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకువచ్చి తమిళనాడు విద్యార్థులు భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని ఉదయనిధి మండిపడ్డారు. నీట్ నిషేధం సహా ప్రతి అంశంలోనూ తమిళనాడుపై ప్రధాని మోడీ వివక్ష చూపుతున్నారని విమర్శించారు.